చౌదరీ చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాధన్‌లకు కూడా భారతరత్న

February 09, 2024


img

మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావుకి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డును ప్రకటించింది. ఆయనతో పాటు దివంగత ప్రధాని, మాజీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన చౌదరీ చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాధన్‌లకు కూడా భారతరత్న అవార్డు ప్రకటించింది. 

దివంగత ప్రధాని పీవీ దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడేస్తే, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాధన్‌ దేశాన్ని ఆహార సంక్షోభం నుంచి బయటపడేశారు. ఆయన కృషి, దూరాలోచన కారణంగా దేశంలో వ్యవసాయ రంగం రూపురేఖలే మారిపోయాయి. దేశవ్యాప్తంగా గణనీయంగా పంట ఉత్పత్తులు పెరిగాయి. నానాటికీ పెరిగిపోతున్న దేశ జనాభాతో ప్రజలకు ఆహార భద్రతకు ముప్పు ఏర్పడింది. దానిని స్వామినాధన్ సాధించిన ‘గ్రీన్ రివల్యూషన్’తో అధిగమించగలిగాము. 

ఎంఎస్ స్వామినాధన్ 1925, ఆగస్ట్ 7వ తేదీన మద్రాస్ రెసిడెన్సీ (ఇప్పుడు తమిళనాడు)లోని కుంభకోణంలో జన్మించారు. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం 1967లోనే పద్మశ్రీతో గౌరవించింది. ఆ తర్వాత 1971లో ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు, 1972లో పద్మ భూషణ్, 1989లో పద్మ విభూషణ్, ఇంకా దేశవిధేశాలలో పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు భారత్‌లో అత్యున్నతమైన భారత రత్న అవార్డు కూడా మరణాంతరం లభించింది. ఎంఎస్ స్వామినాధన్ 2023, సెప్టెంబర్‌ 28న కన్ను మూశారు.


Related Post