తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఎంత వేడిగా జరుగబోతున్నాయో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలియజేస్తున్నట్లు అందరూ ఆటో రిక్షాలలో శాసనసభకు చేరుకున్నారు. హైదర్ గూడాలో ఎమ్మెల్యేల క్వార్టర్స్ నుంచి అందరూ ఆటోలలో శాసనసభకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, “మహాలక్ష్మి పధకం వలన రాష్ట్రంలో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆదాయం కోల్పోయి కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనుక వారికి నెలకు రూ.10,000 పింఛన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రమాదాలలో చనిపోయిన ఆటో రిక్షా డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి,” అని హరీష్ రావు డిమాండ్ చేశారు.
మహాలక్ష్మి పధకం వలన రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. అలాగే ఈ పధకం వలన టిఎస్‌ఆర్టీసీ కూడా తీవ్రంగా నష్టపోతోంది. కనుక ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయంలో నిర్మాణాత్మకమైన సలహా ఇస్తే హుందాగా ఉండేది.
కానీ ఆటో డ్రైవర్ల సమస్యలను, వారి బాధలతో రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుండటం చాలా శోచనీయం.
సున్నితమైన ఈ సమస్యపై ప్రతిపక్ష పార్టీ ఈవిదంగా రాజకీయాలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రదిష్టపాలవుతుంది. కనుక ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల సమస్యను గుర్తించి మహాలక్ష్మి పధకాన్ని పరిమితం చేస్తే వారికీ, ప్రభుత్వానికి, టిఎస్‌ఆర్టీసీకి కూడా చాలా మేలు కలుగుతుంది కదా?