ఓ పక్క తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని బిఆర్ఎస్ సభ్యులు ఆటోలలో శాసనసభకు చేరుకుంటుంటే, మరోపక్క బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జెడ్పీటీసీ ఛైర్ పర్సన్ సునీతారెడ్డి, వారి కుమారుడు రినీష్ రెడ్డి గురువారం సాయంత్రం సిఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు!
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, దామోదర్ రాజనర్సింహ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు వారిని సాధారంగా ఆహ్వానించి పార్టీలో చేర్చుకోవడంపై చర్చించారు.
పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అన్నా, వదినలు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకోవడం వారి వ్యక్తిగత నిర్ణయమని దాంతో తనకు సంబంధం లేదని చెప్పారు. తాను బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని పట్నం నరేందర్ రెడ్డి చెప్పారు.
ఇటీవలే మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సిఎం రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. వారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే వెళ్ళి సిఎం రేవంత్ రెడ్డిని కలిశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ బిఆర్ఎస్ అధిష్టానం వారి చేతే తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టించి ఆ ఊహాగానాలను ఖండింపజేసింది. కానీ అంత మాత్రన్న వారు కాంగ్రెస్‌లోకి వెళ్ళాలనుకుంటే ఆగిపోతారనుకోలేము.