గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు నామినేట్ అయిన ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్‌లకు ఆ సంతోషం దక్కడం లేదు. వారి నియామకాలపై అభ్యంతరం తెలుపుతూ బిఆర్ఎస్ నేతలు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం వారిరువురూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయరాదంటూ స్టే విధించింది. మళ్ళీ నిన్న (గురువారం) ఈ కేసుపై హైకోర్టులో సుదీర్గ విచారణ జరిగింది. ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు విన్న తర్వాత ఈ కేసును నేటికీ వాయిదా వేస్తూ, గత నెల 30న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు (స్టే ఆర్డర్) పొడిగించింది. తుది తీర్పు వెలువడేవరకు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టులో ఈ కేసు లేకపోయి ఉంటే ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసి ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలో పాల్గొనగలిగి ఉండేవారు. కానీ హైకోర్టు స్టే పొడిగించడంతో వారిరువురికీ ఆ అవకాశం లేకుండా పోయింది.
ఒకవేళ నేడు హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు చెపుతూ స్టే ఆర్డర్ ఎత్తివేసినా, బిఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకి వెళ్ళక మానరు. కనుక ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్‌లు ఎమ్మెల్సీలుగా నామినేట్ అయినప్పటికీ వారికి ఆ సంతోషం లేకుండా పోతోంది. కనుక ఈ కేసు ఇంకా తేలేది ఎప్పుడో... వారు ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టేది ఎప్పుడో... ఇంకా ఎంతకాలం నిరీక్షించాలో తెలీదు పాపం!