నేటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆనవాయితీ ప్రకారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉదయం 11.30 గంటలకు ఉభయ సభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. తర్వాత సమావేశాలు రేపటికి వాయిదా పడతాయి. గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాధాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు.
శుక్రవారం రాష్ట్ర ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి వస్తున్నందున, ముందుగా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జరిగిన తొలి సమావేశాలలోనే కాంగ్రెస్, బిఆర్ఎస్ సభ్యుల సభ్యుల మద్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు సాగాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, మేడిగడ్డ బ్యారేజి క్రుంగిపోవడంపై విచారణ జరిపిస్తోంది. అలాగే ధరణి పోర్టల్, మిషన్ భగీరధ మీద కూడా విచారణకు సిద్దమవుతోంది.
బిఆర్ఎస్ పార్టీ చేతిలో కృష్ణా జలాలు, కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకి అప్పగింత అనే రెండు బలమైన ఆయుధాలు ఉన్నాయి. ఒకవేళ బిఆర్ఎస్ శాసనసభా పక్ష నేత కేసీఆర్ కూడా హాజరైతే ఈసారి శాసనసభ సమావేశాలు మరింత వేడివేడిగా సాగడం ఖాయం.
త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక రాష్ట్ర ప్రజలను కూడా ఆకట్టుకోవలసి ఉంటుంది. కనుక శాసనసభ సమావేశాల వేదికగా కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ, మజ్లీస్ నాలుగు పార్టీలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం ఖాయమే.