తెలంగాణ మాజీ సిఎం, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మూడు నెలల తర్వాత నేడు మళ్ళీ తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఆయనకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఈరోజు మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం కానున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డుకు అప్పగించడం, దాని వలన తెలంగాణ రాష్ట్రానికి జరిగే నష్టం గురించి కేసీఆర్ వారితో చర్చించి, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాటాలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
కేసీఆర్ హయాంలో అభివృద్ధి పేరుతో భారీగా అప్పులు, అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న విమర్శలకు జవాబు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ఆయుధాలు అందించింది. మూడు నెలల తర్వాత కేసీఆర్ మళ్ళీ రాజకీయాలలో చురుకుగా పాల్గొనేందుకు వచ్చారు.
కనుక కేసీఆర్ వస్తూనే ఇదే అంశంతో రేవంత్ ప్రభుత్వాన్ని ఢీకొనడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో నల్గొండలో ‘కృష్ణా జలాల పరిరక్షణ సభ’ నిర్వహించబోతున్నారు. ఆ సభ ఏర్పాట్ల గురించి కూడా కేసీఆర్ నేడు చర్చించనున్నారు.