రేవంత్‌ ప్రభుత్వం కూలిపోతుంది: ఏపీ ఎంపీ విజయసాయి రెడ్డి

February 06, 2024


img

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు రోజుల నుంచే ప్రభుత్వం కూలిపోతుందని బిఆర్ఎస్‌ నేతలు బెదిరిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. ఇప్పుడు ఏపీలో వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి కూడా అదే చెపుతున్నారు.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో విజయ సాయిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ వలనే దేశం నష్టపోయిందని, అది అధికారంలో లేనప్పుడే దేశం అభివృద్ధి చెందుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నటికీ అధికారంలోకి రాలేదని, రాహుల్ గాంధీ ఓ అసమర్ధుడని విమర్శించారు. 

తెలంగాణలో కాంగ్రెస్‌ అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ హామీలు నిలబెట్టుకోలేదు కనుక ఆరు నెలల్లో రేవంత్‌ ప్రభుత్వం కూలిపోక తప్పదని విజయసాయి రెడ్డి ఆన్నారు. 

విజయసాయి రెడ్డి కాంగ్రెస్‌ని టార్గెట్ చేసుకుని ఈవిదంగా మాట్లాడటానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీలు కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని తమ రాజకీయ శత్రువులుగా భావిస్తుంటారు.

కనుక కాంగ్రెస్‌ పార్టీని విమర్శించి ప్రధాని నరేంద్రమోడీని ప్రసన్నం చేసుకుంటే, త్వరలో జరుగబోయే ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వం ఏపీలోని టిడిపి, జనసేనలవైపు మొగ్గకుండా, వాటికి ఏవిధమైన సహాయ సహకారాలు అందకుండా చేయాలనే తాపత్రయంతోనే!

ఇదిగాక వైఎస్ షర్మిల తెలంగాణ నుంచి హఠాత్తుగా ఏపీకి వచ్చేసి కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి జగన్మోహన్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైసీపి నేతలను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 

కనుక ఆమె వలన, మళ్ళీ కోలుకుంటున్న కాంగ్రెస్‌ వలన ఏపీలో వైసీపికి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఆమె వలన వైసీపి ఎన్నికలలో నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఆమెను విమర్శించలేక కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని విజయసాయి రెడ్డి విమర్శిస్తున్నారని అనుకోవచ్చు.   


Related Post