ప్రతిష్టాత్మకమైన పద్మా అవార్డులకు ఎంపికైనవారిని
తెలంగాణ ప్రభుత్వం శిల్పకళావేదికలో నేడు ఘనంగా సత్కరించింది. పద్మ విభూషణ్ అవార్డుకు
ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీతో సహా పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన రెండు తెలుగు రాష్ట్రాలకు
చెందిన కళాకారులు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమామహేశ్వరి, సాహిత్యవేత్తలు
కూరెల్ల విఠలాచార్య, కేశావత్ సోమ్‌లాల్‌ను సిఎం రేవంత్
రెడ్డి, మంత్రులు కలిసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగం చాలా హుందాగా, స్పూర్తిదాయకంగా ఉంది. “మన తెలుగువారు ఎక్కడున్న మానవాళ్ళే. కనుక మనవాళ్ళకు పద్మ అవార్డులు వస్తే మన అందరికీ గర్వకారణమే. అయితే పద్మశ్రీ అవార్డు వచ్చినవారిలో చాలామంది నిరుపేద కళాకారులున్నారు.
అంత దూరం నుంచి ఇక్కడ హైదరాబాద్‌లో ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చేందుకు దారి ఖర్చులు
కూడా పెట్టుకోలేనివారున్నారు. ఇంత గొప్ప అవార్డు అందుకున్నవారు ఈ పరిస్థితిలో ఉండటం
చాలా బాధాకరం. ఈ చప్పట్లు, దుప్పట్లు ఒకటే సరిపోవు. కనుక ఇక నుంచి పద్మశ్రీ అవార్డులకు ఎంపికైనవారికి ఒక్కొక్కరికీ రూ.25 లక్షల
నగదు బహుమతి, నెలకు రూ.25,000 పింఛను కూడా
అందిస్తాము,” అని ప్రకటించారు.
వెంకయ్యన్నాయుడు గురించి మాట్లాడుతూ, “నేను విద్యార్ధి దశలో ఉన్నప్పటి నుంచే ఆయనతో నాకు పరిచయం ఉంది. మన భాష, యాస, సంస్కృతీ సాంప్రదాయాలు ఎంత ముఖ్యమో నేను ఆయన నుంచే తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఆయన నాకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు.
ఆయన కళ్లెదుటే నేను ఈ స్థాయికి ఎదిగాను. ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు అందుకోబోతున్న వెంకయ్యనాయుడు గారిని నా చేతుల మీదుగా సన్మానించే అదృష్టం నాకు దక్కినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఢిల్లీకి వెళ్ళే మన రాజకీయ నాయకులందరికీ ఆయనే పెద్ద దిక్కు.
అప్పట్లో రాజకీయాలలో జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు జంటకవుల్లా
ఉండేవారు. వారిరువురి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మన తెలుగువారైన వెంకయ్య
నాయుడు రాష్ట్రపతి అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆయన ప్రసంగాన్ని వినాలని
నేను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను,” అని సిఎం రేవంత్
రెడ్డి అన్నారు.
చిరంజీవి గురించి మాట్లాడుతూ, “ఈరోజుల్లో ఒకటి రెండు సినిమాలు చేసేసరికి చాలామంది పెద్ద హీరో అయిపోయామనుకుంటారు. కానీ చిరంజీవి నాలుగు దశాబ్ధాలుగా 150కి పైగా సినిమాలు చేసినప్పటికీ నేటికీ అదే క్రమశిక్షణ, సంస్కారం, హుందాతనం, పెద్దల పట్ల వినయవిధేయతలు చూపుతుంటారు.
దశాబ్ధాల క్రితం ఆయన ‘పున్నమినాగు’ సినిమాలో ఎంత అద్భుతంగా నటించారో, ‘సైరా’లో కూడా అంతే అద్భుతంగా నటించారు. చిరంజీవి మన తెలుగువారు
అని చెప్పుకోవడం మన అందరికీ గర్వకారణమే,” అని అన్నారు.
“ఈ అవార్డుల
కార్యక్రమంలో పాల్గొన్న మా మంత్రులు, విహెచ్ హనుమంతరావు వంటి పెద్దలు, వెంకయ్యనాయుడు, చిరంజీవి, ఇతర కళాకారులు నాకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. వారి సూచనల మేరకే పద్మశ్రీ అవార్డు
గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతి, నెలకు 25వేలు పింఛన్ ఇవ్వాలని
నిర్ణయించాము,” అంటూ సిఎం రేవంత్ రెడ్డి ఇటువంటి సలహా ఇచ్చిన
వారిపట్ల కూడా సభాముఖంగా గౌరవం ప్రకటించడం అభినందనీయం.