లోక్‌సభ టికెట్‌ కోసం డా. గడల శ్రీనివాసరావు దరఖాస్తు

February 04, 2024


img

డా. గడల శ్రీనివాసరావు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌గా పనిచేస్తూ శాసనసభ ఎన్నికలలో కొత్తగూడెం టికెట్‌ కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళ్ళు మొక్కి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా కేసీఆర్‌ ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆయనను ఆ పదవి నుంచి బదిలీ చేసింది. ప్రస్తుతం లాంగ్ లీవ్‌లో ఆయన లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు మళ్ళీ సిద్దమయ్యారు. 

కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు ఆహ్వానించగా ఆయన కూడా ఖమ్మం, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే స్వయంగా వచ్చి దరఖాస్తు సమర్పిస్తే ముఖ్యమంత్రి, మంత్రుల ఆగ్రహానికి గురి కావలసివస్తుందనో లేదా మళ్ళీ విమర్శలు వస్తాయననో భావించి తన సన్నిహితుడి చేత దరఖాస్తులు సమర్పించారు. 

శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో తిరుగులేని విజయం సాధించడంతో ఈసారి ఖమ్మం సీటుకి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.

అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికలలో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్‌ తీర్మానం చేసి పంపినందున, ఒకవేళ ఆమె అంగీకరిస్తే ఆమెను ఖమ్మం లేదా మెదక్ నుంచి బరిలో దిగవచ్చు. ఒకవేళ ఆమె పోటీకి సిద్దపడితే ఆ స్థానంలో మరెవరికీ అవకాశం ఉండదని వేరే చెప్పక్కరలేదు.


Related Post