బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య త్వరలో పార్టీ మారబోతున్నట్లు చెప్పేశారు. అయితే ఈ సందర్భంగా ఆయన బిఆర్ఎస్ అధిష్టానం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ నాకు మా అధిష్టానం గుర్తింపు, గౌరవం లేదు. స్టేషన్ ఘన్‌పూర్ సీటుని త్యాగం చేసి వరంగల్ జిల్లాలో ఇద్దరు అభ్యర్ధులను గెలిపించినా గుర్తింపు లేదు. కనీసం స్థానిక నాయకుల దగ్గర కూడా నాకు గుర్తింపు లేదు.
ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు నెలలవుతున్నా ఇంతవరకు నాకు మా అధిష్టానాన్ని కలిసే అవకాశం లభించలేదు. ఇదీగాక మా పార్టీ పెద్దలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం... ఆర్నెల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటూ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అధికారంలో లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉండలేమా?సీపీఐ, సీపీఎం, మజ్లీస్, బీజేపీలు ప్రతిపక్షపార్టీలుగా ప్రజా సమస్యలపై పోరాడటం లేదా?
ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బెదిరించడం ఏం పద్దతి?మా పార్టీ నేతలు మాట్లాడుతున్న ఈ అప్రజాస్వామికమైన మాటలు, మా పార్టీ విధి విధానాలు, తీరు నాకు నచ్చడం లేదు.
ఎన్నికల తర్వాత స్టేషన్ ఘన్‌పూర్‌లో గెలిచినవారు ఎవరూ కనిపించడం లేదు. కానీ తెల్లారిలేస్తే నేను ఇక్కడే తిరుగుతుంటాను. అందరికీ నేనే జవాబు చెప్పుకోవలసి వస్తోంది.
స్టేషన్ ఘన్‌పూర్‌లో నా అనుచరుల నుంచి కూడా ఒత్తిడి పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితులలో పార్టీలో ఇంకా కొనసాగడం అవసరమా?అనిపిస్తోంది.
నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేశాను. ఆ పార్టీలో ఢిల్లీ వరకు గల నాయకుల వరకు నాకు మంచి పరిచయాలు, సత్సంబంధాలు ఉన్నాయి. కనుక త్వరలోనే నియోజకవర్గంలోని ప్రజలతో, నా అనుచరులతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటాను,” అని తాటికొండ రాజయ్య చెప్పారు.
అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టమైంది. అయితే ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశ్యించిన చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు, బిఆర్ఎస్ పార్టీ తీరుతెన్నుల గురించి చెప్పిన విషయాలు ఆ పార్టీలో కలకలం సృష్టించకమానవు.
(Video Courtesy: ETV)