తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఓ విలేఖరి “మీరు ఏపీ శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా?” అంటూ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు.
దానికి ఆమె ఏమాత్రం సంకోచించకుండా, “తప్పకుండా... ఇప్పుడు నేనేమీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో లేను కదా? మా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే నేను తప్పకుండా ఏపీ కాంగ్రెస్, వైఎస్ షర్మిల తరపున ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను,” అని చెప్పారు.
కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ షర్మిలని ఏపీకి పంపించి ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించడంతో, ఆమె తన అన్న జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగతంగా, రాజకీయంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కొండా సురేఖ కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని రాజకీయంగా చాలా నష్టపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజన జరుగుతున్నట్లు జగన్ గుర్తించగానే, తెలంగాణలోని కొండా సురేఖతో సహా వైసీపి నేతలను నడిరోడ్డున వదిలేసి ఏపీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన చెల్లి వైఎస్ షర్మిల కూడా సరిగ్గా అలాగే చేశారు.
వైఎస్ షర్మిల తన సొంత అన్నపై యుద్ధం ప్రకటించి తీవ్ర విమర్శలు చేస్తునప్పుడు, జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మంత్రి కొండా సురేఖకు అభ్యంతరం ఎందుకు ఉంటుంది?అందుకే సై అన్నట్లు భావించవచ్చు.