కాంగ్రెస్ మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, “బిఆర్ఎస్ పార్టీ ఓటమికి ఆ పార్టీ సోషల్ మీడియా దుష్ప్రచారం కూడా కారణమే.
నా దగ్గర పనిచేసే నాలుగురిని కేటీఆర్ తీసుకుపోయి పెట్టుకున్నారు. సోషల్ మీడియాపై బిఆర్ఎస్ పార్టీ లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ అదే బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమైంది,” అని అన్నారు.
రేవంత్ రెడ్డి పాలన గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “బాగానే ప్రారంభించారు. ఇప్పుడు ప్రభుత్వంలో దద్దమ్మలు, సన్నాసులనే మాటలు వినిపించడం లేదు. సిఎం రేవంత్ రెడ్డితో సహా అందరూ చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారు. మాట్లాడుతున్నారు. అది చూసి ప్రజలు కూడా హర్షిస్తున్నారు.
అయితే ఇదొక్కటే సరిపోదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుచేయడం అసంభవం. వాటిని అమలుచేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుంది. కనుక తప్పనిసరిగా అమలుచేయాల్సి ఉంటుంది. ఎలా చేస్తారో చూద్దాం,” అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయవిచారణ గురించి అడిగిన ప్రశ్నకు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలనమైన జవాబు చెప్పారు. “ఈ కేసులో కేసీఆర్ ఎప్పుడో జైలుకు పోవలసిఉండేది. కానీ ఆయనను కాంగ్రెస్ అధిష్టానమే కాపాడుతోంది. అందుకే రేవంత్ రెడ్డి ఈ కేసుని సీబీఐకి అప్పగించకుండా న్యాయవిచారణ అంటున్నారు.
న్యాయవిచారణ మొదలుపెడితే అది పదేళ్ళు పట్టవచ్చు లేదా 20 ఏళ్ళు పట్టవచ్చు. అంటే కేసీఆర్‌ని కాపాడటం కోసమే న్యాయవిచారణ అన్నమాట. కేసీఆర్‌ని ఎందుకు కాపాడాల్సి వస్తోందంటే, ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్, బీజేపీలు ముఖాముఖీ పోటీ పడితే బీజేపీ గెలుస్తుంటుంది. కనుక బీజేపీని నిలువరించాలంటే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ని కాపాడుకోవాలి,” అని అన్నారు.