ప్రముఖ పారిశ్రామికవేత్త, అమర్ రాజా బ్యాటరీస్ అధినేత, గుంటూరు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ ‘రాజకీయాలకు గుడ్ బై’ అంటూ ఈరోజు సంచలన ప్రకటన చేశారు. పారిశ్రామికవేత్తగా, ఎంపీగా రెంటినీ బ్యాలన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది.
పార్ట్ టైమ్ రాజకీయాలు చేయలేను. కనుక రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఇకపై తన పరిశ్రమలు, వ్యాపారాలకు పూర్తి సమయం కేటాయించాలనుకున్నట్లు గల్లా జయదేవ్ చెప్పారు.
అయితే తాను ఓ పారిశ్రామివేత్తగా ఉంటూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని తట్టుకోవడం కష్టమని కూడా చెప్పారు. కనుక ఆయన ఈ రాజకీయ ఒత్తిళ్ళు, వేధింపులను తట్టుకోలేకనే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఆయన టిడిపి ఎంపీ కావడంతో ఏపీలోని చిత్తూరు కేంద్రంగా పనిచేస్తున్న అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు వైసీపి ప్రభుత్వం నుంచి వేధింపులు ఎక్కువైపోయాయి. దాంతో ఆయన తెలంగాణలో రూ.9,200 కోట్లు పెట్టుబడితో భారీ బ్యాటరీల తయారీ పరిశ్రమని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదే కారణంగా ఎంపీగా పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేని పరిస్థితిలో ఉన్నానని ఆయనే స్వయంగా నేడు చెప్పారు.
రాజకీయాలలో ఉంటూ పూర్తి సమయం కేటాయించలేనప్పుడు, తనను ఎన్నుకున్న ప్రజలకు పూర్తి న్యాయం చేయలేనప్పుడు, పార్లమెంట్ వెనుక బెంచీలలో మౌనంగా కూర్చోవడం కంటే రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని గల్లా జయదేవ్ చెప్పారు.
పార్లమెంట్‌లో తన వంటి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు 24 శాతం మంది ఉన్నారని, వారందరి పరిస్థితి కూడా ఇదేనని గల్లా జయదేవ్ చెప్పారు.
ఈరోజు నెల్లూరులో జరుగుతున్న టిడిపి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “ఏపీలో నాతో సహా అందరూ బాధితులే. వైసీపి ప్రభుత్వం వేధింపులు భరించలేక రాష్ట్రం విడిచి వెళ్ళిపోగలిగినవారు అందరూ వెళ్ళిపోతున్నారు. వారిలో గల్లా జయదేవ్ కూడా ఒకరు,” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.