గవర్నర్‌ విందుకు బిఆర్ఎస్‌ నేతలు డుమ్మా!

January 27, 2024


img

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఆనవాయితీ ప్రకారం ‘ఎట్ హోమ్’ విందు ఏర్పాటుచేసి అధికార, ప్రతిపక్ష నేతలందరినీ ఆహ్వానించారు. ఈ విందు కార్యక్రమానికి సిఎం రేవంత్‌ రెడ్డితో సహా మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

కానీ బిఆర్ఎస్‌ తరపున కేటీఆర్‌, హరీష్ రావువంటివారు ఎవరూ హాజరుకాలేదు. ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, గోరటి వెంకన్నలు మాత్రం హాజరయ్యారు. 

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గవర్నర్‌ పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ, ఇటువంటి కార్యక్రమాలకు ఎవరినీ వెళ్ళనిచ్చేవారు కారు. నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో గవర్నర్‌ తమిళిసై ప్రసంగిస్తూ ‘తెలంగాణలో నిరంకుశ పాలన అంతరించి మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుద్దరణ జరిగిందంటూ’ కేసీఆర్‌ పాలనను ఉద్దేశ్యించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదీగాక కాంగ్రెస్‌ ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరినీ గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఆమోదించారు. 

దీంతో ఆమెపై బిఆర్ఎస్‌ నేతలు మళ్ళీ యుద్ధం ప్రకటించి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో గవర్నర్‌ ఇచ్చిన ఎట్ హోమ్ విందుకు హాజరవుతారని ఎవరూ ఆశించరు కూడా. కానీ రేపు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఏమైనా పిర్యాదులు చేయాల్సి వస్తే బిఆర్ఎస్‌ నేతలు ఆమె వద్దకే వెళ్ళాల్సి ఉంటుందనే సంగతి మరిచిపోయినట్లున్నారు. 

ఇదివరకు ఆమెతో అనుచితంగా వ్యవహరించిన కేసీఆర్‌, ఆమె ప్రమేయం లేకుండానే శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. కానీ ఆమె అనుమతి లేకుండా, ఉభయ సభ సభ్యులను ఉద్దేశ్యించి ఆమె ప్రసంగించకుండా, బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించలేమని గ్రహించిన తర్వాత, కేసీఆర్‌ ఆమెతో రాజీ పడక తప్పలేదు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన అధికార పరిధి, పరిమితులను గ్రహించేలా చేశారు గవర్నర్‌ తమిళిసై. 

ఎన్నికలలో ఓడిపోయి ఇప్పుడు ప్రతిపక్షంలోకి కూర్చున్నప్పుడైనా కేసీఆర్‌ తీరు మార్చుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమెను బీజేపీ ఏజంట్ అని నిందించడం వలన రేపు బీజేపీతో చేతులు కలిపేందుకు కూడా అవకాశం లేకుండా చేసుకుంటున్నారు. 

కేసీఆర్‌ అందరితో కయ్యాలు పెట్టుకుని అందరినీ శత్రువులుగా మార్చుకోవడం వలననే బిఆర్ఎస్‌ పార్టీ ఎన్నికలలో ఓసారి నష్టపోయింది. అయినా అదే తీరు కొనసాగిస్తున్నందున బిఆర్ఎస్‌ పార్టీ మళ్ళీ మళ్ళీ నష్టపోయినా ఆశ్చర్యం లేదు.             



Related Post