రగిలిపోతున్న అజారుద్దీన్... రాజీనామాకు సిద్దం?

January 26, 2024


img

మాజీ క్రికెటర్, తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నేత మహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమవుతున్నారు. అనేక ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తనను కాదని అమరుల్లా ఖాన్‌కు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు ఆయన కాంగ్రెస్‌ అధిష్టానంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ విష్ణువర్ధన్ రెడ్డిని కాదని ఆయనకు జూబ్లీహిల్స్‌ నుంచి శాసనసభకు పోటీ చేసేందుకు టికెట్‌ ఇచ్చింది. కానీ ఆయన ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి మాగంటి గోపీనాధ్ చేతిలో ఓడిపోయారు. 

అయితే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో, మళ్ళీ అజరుద్దీన్ ఆశలు చిగురించాయి. ఎప్పటికైనా మంత్రినవ్వాలని ఆయన చాలా తహతహలాడుతున్నారు. కనుక గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ కాగలిగితే మంత్రి పదవి పొందవచ్చని అని ఆశపడి కాంగ్రెస్‌ అధిష్టానంతో మాట్లాడి హామీ సంపాదించుకున్నారు. 

కానీ కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనను కాదని అమరుల్లా ఖాన్‌ను ఎమ్మెల్సీ పదవి కల్పించడంతో అజారుద్దీన్ రగిలిపోతున్నారు. కనుక మరోసారి కాంగ్రెస్‌ అధిష్టానంతో మాట్లాడి, అప్పటికీ ఎటువంటి హామీ లభించకపోతే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడితే ఆయనే నష్టపోతారు. కనుక కాంగ్రెస్‌లో కొనసాగితే సిఎం రేవంత్‌ రెడ్డి ఆయనకు కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది. బయటకు పోతే అదీ లభించదు కదా?


Related Post