తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు, బిఆర్ఎస్ పార్టీకి మద్య చాలా కాలంగా యుద్ధం సాగింది. ఇప్పుడు బిఆర్ఎస్ అధికారంలో లేనప్పటికీ ఇంకా ఆమెతో యుద్ధం కొనసాగుస్తుండటం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన వెంటనే, ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఆమోదముద్ర వేయడమే ఈ యుద్ధానికి కారణం.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమకారుడు దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని గతంలో మేము కోరినప్పుడు ఆమె తిరస్కరించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన వెంటనే టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్‌లను ఎమ్మెల్సీలు నియమించారు.
మేము సిఫార్సు చేసినవారిలో సత్యనారాయణ రాజకీయ నేపధ్యం ఉందని తిరస్కరించినప్పుడు, ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్‌ని ఏవిదంగా ఎమ్మెల్సీగా నియమించారో గవర్నర్ చెప్పాలి. ఈ నియామకాలతో కాంగ్రెస్, బీజేపీల మద్య రహస్య అవగాహన ఉందనే విషయం మరోసారి బయటపడింది.
రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న సొమ్ముతోనే రాజ్‌భవన్ నడుస్తోంది తప్ప రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సొమ్ముతో కాదని గవర్నర్ గ్రహించాలి. కనుక ఆమె రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉండాలి తప్ప సిఎం రేవంత్ రెడ్డికి కాదని తెలుసుకోవాలి. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నప్పుడు ఆమె అన్ని పార్టీలను సమానంగా చూడాలి తప్ప ఆమె కూడా ఈవిదంగా రాజకీయాలు చేయడం తగదు,” అని కేటీఆర్ అన్నారు.
నిజానికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం గవర్నర్ విచక్షణ మేరకే జరుగుతుంది. కానీ ఆ రెండు సీట్లు కూడా తమకే దక్కాలని, తద్వారా పార్టీలో ఇద్దరికీ రాజకీయ పదవులు కట్టబెట్టి సంతృప్తి పరచాలని అధికార పార్టీలు భావిస్తుంటాయి. ఇందుకు గవర్నర్లు ఎప్పుడూ అభ్యంతరం చెప్పక పోవడం వలన ఆ రెండు సీట్లు కూడా తమ చట్టబద్దమైన హక్కుగానే అధికార పార్టీలు భావించడం మొదలుపెట్టాయి.
అయితే పాడి కౌశిక్ రెడ్డి నియామకం విషయంలో గవర్నర్ ప్రశ్నిస్తే కేసీఆర్ అహం దెబ్బతింది. అప్పటి నుంచి గవర్నర్ తమిళిసైపై కేసీఆర్ కత్తులు దూయడం మొదలుపెట్టారు. ఆమెకు ప్రోటోకాల్ పాటించకపోగా, ఇలాగే తన మంత్రులు, ఎమ్మెల్యేల చేత ఆమెను విమర్శింపజేశారు. ఇలాగే ఆమెకు బీజేపీతో సంబంధం అంటగడుతూ ఆమెపై బురద జల్లించారు.
ఆమె గవర్నర్ అయినప్పటికీ ఆమె కూడా ఓ మనిషే. కనుక ఆమెకు మానావమానాలు ఉంటాయి. ఆ ప్రకారం ప్రతిస్పందిస్తుంటారు. ఆమెతో కేసీఆర్ ప్రభుత్వం తప్పుగా వ్యవహరించడం వలననే కేసీఆర్ చేసిన సిఫార్సులను ఆమె తిరస్కరించారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి ఆమెతో గౌరవంగా వ్యవహరిస్తున్నందున కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరినీ ఎమ్మెల్సీలుగా ఆమోదించారు.
ఈవిషయం ఆమెను మళ్ళీ విమర్శిస్తున్న కేటీఆర్, హరీష్ రావులకు కూడా బాగా తెలుసు. లోక్‌సభ సన్నాహక సమావేశాలలో కేటీఆర్,హరీష్ రావులు తమ పార్టీలో లోపాలు, తప్పులను సరిదిద్దుకుంటామని పదేపదే చెప్పారు. కానీ వారి తీరు ఏమాత్రం మారలేదని స్పష్టమవుతోంది.