గత 3-4 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వాన్ని, దాన్ని నడిపిస్తున్న ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీపై కత్తులు దూసిన బిఆర్ఎస్ పార్టీ, శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని, దాని నేతలపై కత్తులు దూస్తోంది.
ప్రస్తుతం కేసీఆర్ మీడియా, ప్రజల ముందుకు రాలేకపోతున్నారు కనుక బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇద్దరూ బహుశః ఆయన సూచనల మేరకు పార్టీ తరపున కత్తులు దూస్తున్నారు. కాంగ్రెస్ చేతిలో ఓడిపోయి అధికారం కోల్పోవడమే వారి అసహనానికి, ఆక్రోశానికి కారణమని అర్దమవుతూనే ఉంది.
కేటీఆర్ చేసిన తాజా ట్వీట్‌లో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతూనే, కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు సిద్దం అవుతున్న సంకేతాలు ఇచ్చారు.
కాంగ్రెస్ పని అయిపోయిందని, ఇండియా కూటమి విచ్ఛిన్నం అయ్యిందని, ఇక దేశ ప్రజలు బిఆర్ఎస్, ఆమాద్మీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల వంటి ప్రాంతీయపార్టీల వైపే చూస్తున్నారని దానిలో పేర్కొన్నారు. తద్వారా కేసీఆర్ మళ్ళీ ఆ రెండు పార్టీలతో కలిసి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు సిద్దం అవుతున్నట్లు సంకేతం ఇచ్చిన్నట్లే భావించవచ్చు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ చూస్తే అర్దమవుతుంది.