గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్ ఇద్దరినీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు నియమిస్తూ ఆమోదముద్ర వేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రొఫెసర్ కోదండరామ్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లయింది.
తర్వాత ఆయనకు విద్యాశాఖ మంత్రిగా నియమించాలని సిఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అదే కనుక జరిగితే తెలంగాణ ఉద్యమకారుడు, ఉన్నత విద్యావంతుడు, మేధావి అయిన ప్రొఫెసర్ కోదండరామ్‌ని సముచిత గౌరవం కల్పించినట్లవుతుంది.
బిఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో కూడా గొడవపెట్టుకోవడం వలన ఆయన ప్రభుత్వం సిఫార్సు చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టేశారు. దానిపై బిఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళినా ఫలితం లేకుండాపోయింది. అప్పటి నుంచే ఆమె ఓ మహిళ అని కూడా చూడకుండా కేసీఆర్ ప్రభుత్వం చాలా అమర్యాదగా వ్యవహరిస్తూ, విమర్శిస్తూండేది.
కనీసం ప్రోటోకాల్ పాటించకుండా ఆమెను అవమానిస్తూనే ఉండేది. కేసీఆర్ చివరి వరకు ఆమె పట్ల ఇదేవిదంగా వ్యవహరిస్తున్నప్పటికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చాలా హుందాగానే వ్యవహరించేవారు.
కేసీఆర్ స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఆమె పట్ల చాలా మర్యాదగా, గౌరవంగా వ్యవహరించడమే కాకుండా ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటిస్తూ ఆమెకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు.
కనుక రేవంత్ రెడ్డి సిఫార్సు చేయగానే ఇద్దరు ఎమ్మెల్సీల గురించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరో ప్రశ్న వేయకుండా వెంటనే ఆమోదించారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు హుందాతనం పాటిస్తే ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో తెలుసుకునేందుకు ఇదే ఓ చిన్న నిదర్శనంగా చెప్పుకోవచ్చు.