జగన్‌ రెడ్డికి ఈ బాధ భరించడం కష్టమే!

January 25, 2024


img

ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి, ఆయన పార్టీ, ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ళుగా ఎదురులేకుండా సాగింది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టించగలిగారు కూడా.

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ ఎంతగానో అభివృద్ధి చేసినా 119 సీట్లు గెలుచుకోగలమనుకోలేదు. కానీ జగన్‌ ఏపీని ఏమాత్రం అభివృద్ధి చేయకపోయినా రాబోయే ఎన్నికలలో 175కి 175 సీట్లు గెలుచుకోగలమని ధీమా వ్యక్తం చేసేవారు. 

నాలుగున్నరేళ్ళుగా జగన్‌ ప్రభుత్వం ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు సాగిపోయింది. మరో మూడు నెలలో ఎన్నికలు జరుగబోతుంటే ఇప్పుడు ఆయనకు, వైసీపి ప్రభుత్వానికి, పార్టీకి కూడా ఊహించని సమస్య చెల్లెలు వైఎస్ షర్మిల రూపంలో వచ్చిపడింది. 

ఆమెను తెలంగాణ కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి రేవంత్‌ రెడ్డి తదితరులు అభ్యంతరం చెప్పడంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఆమెను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమించింది. ఇక అప్పటి నుంచి ఆమె అన్న జగన్మోహన్‌ రెడ్డిని, ఆయన ప్రభుత్వ తీరుని, అనాలోచిత నిర్ణయాలు, విధానాలను తప్పు పడుతూ తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టేశారు. 

ఆమె ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టగానే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ, ప్రజల మద్యకు వెళ్ళి తన అన్న జగన్మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయడంటూ వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శిస్తున్నారు. 

అన్న దురాశ కారణంగానే తమ కుటుంబంలో విభేధాలు మొదలయ్యాయని, ఇందుకు తమ తల్లి విజయమ్మే సాక్షి అంటూ కుటుంబంలోని సమస్యలను కూడా బయటపెట్టేస్తున్నారు.

దీంతో ఆమెను ఏవిదంగా ఎదుర్కోవాలో తెలియక జగన్మోహన్‌ రెడ్డితో సహా వైసీపిలో అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆమెను నేరుగా తిట్టలేక చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానం అందరూ కలిసి తమ పార్టీని దెబ్బతీసేందుకు కుట్రపన్ని ఆమెను ఏపీకి తీసుకువచ్చారని జగన్మోహన్‌ రెడ్డితో సహా అందరూ ఆక్రోశిస్తున్నారు. 

అయితే అన్న కారణంగానే తాను తెలంగాణకు వెళ్ళి పార్టీ పెట్టుకొని అనేక అవమానాలు, అవహేళనలు భరించాల్సి వచ్చిందని వైఎస్ షర్మిల చెపుతుండటంతో వైసీపి నేతలకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారిప్పుడు.

ఇంతకాలం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లు జగన్మోహన్‌ రెడ్డిని, వైసీపి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే, వారు రాజకీయ దురుదేశ్యంతోనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని వైసీపి నేతలు సర్ధి చెప్పుకునేవారు. 

కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ సొంత చెల్లెలే తమను విమర్శిస్తుంటే ఆమెను ఏవిదంగా ఎదుర్కోవాలో, ప్రజలకు ఏమని సర్దిచెప్పుకోవాలో తెలియక జగన్మోహన్‌ రెడ్డితో సహా వైసీపి నేతలు తల పట్టుకుంటున్నారు. జగన్మోహన్‌ రెడ్డికి ఇది పైకి చెప్పుకోలేని పెద్ద సమస్యే. దీని నుంచి ఆయన ఏవిదంగా బయటపడతారో?


Related Post