ఆ నలుగురినీ హరీష్ రావే రేవంత్‌ వద్దకు పంపారట!

January 25, 2024


img

మొన్న నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిఎం రేవంత్‌ రెడ్డితో భేటీ అవడంతో ఆ పార్టీలో కలకలం మొదలైంది. దీనిపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తనదైన శైలిలో విశ్లేషించి చెప్పారు. 

బిఆర్ఎస్ పరిస్థితి చూస్తే భగవత్ గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఖర్మ సిద్దాంతం గుర్తొస్తుంది. ఎవరు చేసిన ఖర్మకు వారు ఫలితం అనుభవించక తప్పదని ఆనాడే శ్రీకృష్ణుడు చెప్పాడు. భూమి గుండ్రంగా ఉంటుంది. అలాగే ఈ సమాజానికి నువ్వు ఏమిస్తే అదే తిరిగి వస్తుంది. ఇది అక్షరాల బిఆర్ఎస్ పార్టీకి వర్తిస్తుంది. 

గతంలో నియోజకవర్గం అభివృద్ధి కోసమే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బిఆర్ఎస్‌లో చేర్చుకున్నామని కేసీఆర్‌ చెప్పుకున్నారు. ఇప్పుడు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా అదే సాకుతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు కదా? 

అయితే దీన్ని కప్పి పుచ్చుకునేందుకు, వారు నలుగురి చేత బిఆర్ఎస్‌ కార్యాలయంలో బలవంతంగా వేరేలా స్టేట్‌మెంట్ ఇప్పించారు.

 మీరు (కేసీఆర్‌) అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రోటోకాల్ అనే పదానికి అర్దం లేకుండా చేశారు. ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడేందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిఎం రేవంత్‌ రెడ్డిని కలిశారట!

 కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో రైతుబంధు లేదా మరేదైనా పధకానికి నిధులు విడుదల చేయాలంటే, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు వచ్చేసేవారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అసలు పట్టించుకునేవారే కాదు కదా? అప్పుడు గుర్తుకు రాని ప్రోటోకాల్ ఇప్పుడు అధికారం కోల్పోగానే గుర్తుకు వచ్చిందా మీకు?

పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీకు తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు కంటికి ఆనలేదు. ఓడిపోయాక ఇప్పుడు వారందరితో మాట్లాడుతారట!    

మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు హరీష్ రావుకు తెలియకుండానే, ఆయన అనుమతి తీసుకోకుండానే వెళ్ళి సిఎం రేవంత్‌ రెడ్డిని కలిశారంటే నమ్మశక్యంగా ఉందా?

మెదక్ ఎంపీ టికెట్‌ కోసం కల్వకుంట్ల కవిత తండ్రిపై ఒత్తిడి చేస్తుండటం నచ్చని హరీష్ రావే, ఈ నలుగురు ఎమ్మెల్యేలని సిఎం రేవంత్‌ రెడ్డి వద్దకు పంపారని, కానీ మీరు ఇప్పటికే మెదక్ టికెట్‌ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మేసుకున్నారని కూడా మాకు తెలుసు. ఆనాడు రాజశేఖర్ రెడ్డిని కలిసిన హరీష్ రావే ఇప్పుడూ బిఆర్ఎస్ పార్టీలో కట్టప్పలా నిశబ్ధంగా పనిచేస్తున్నారు.

మెదక్ టికెట్‌ కోసమే మీ కుటుంబంలో కీచులాటలు జరుగుతున్నాయని కూడా మాకు తెలుసు. మిమ్మల్ని ప్రజలు గద్దె దించి ఇంట్లో కూర్చోపెట్టినప్పటికీ, ఇంకా మీ ఇంట్లో అధిపత్య పోరు సాగుతూనే ఉందని ఈ తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి,” అని రఘునందన్ రావు అన్నారు.


Related Post