బిఆర్ఎస్ పార్టీని సమూల ప్రక్షాళన?

January 24, 2024


img

శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి అధికారం కోల్పోవడంతో ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానంలో అంతర్మధనం మొదలైంది. లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాలలోనే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీనియర్ నేత హరీష్ రావు ఇద్దరూ పార్టీలో పెనుమార్పులు జరుగబోతున్నాయని చెపుతున్నారు. 

గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలే జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పుతుండేవారు. కనుక గ్రామ, మండల స్థాయిలో పార్టీ పరిస్థితి గురించి అధిష్టానానికి తెలియకుండా పోయింది. కనుక ఇప్పుడు దిగువ స్థాయి నేతలు, కార్యకర్తలతో కూడా తరచూ సమావేశమవుతూ, ఎప్పటికప్పుడు పార్టీలో సమస్యలను పరిష్కరించుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుందామని కేటీఆర్‌ అన్నారు. 

అలాగే బిఆర్ఎస్ కారు సర్వీసింగ్‌కు వెళ్ళిందని తిరిగి వచ్చి లోక్‌సభ ఎన్నికలలో రెట్టింపు వేగంతో పరుగులు తీస్తుందని చెప్పారు. కారులో పాడైపోయిన యంత్రాలను, పరికరాలను తొలగించి కొత్తవాటిని బిగించిన్నట్లు, పార్టీకి భారంగా మారినవారిని, నష్టం కలిగిస్తున్నవారిని వదిలించుకుని, వారి స్థానంలో కొత్తవారితో భర్తీ చేయబోతున్నామని కేటీఆర్‌ సూచించినట్లు భావించవచ్చు. 

తుంటి ఎముక మార్పిడి చేయించుకున్న కేసీఆర్‌, గత నెల రోజులుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటునప్పటికీ, మండల, గ్రామ స్థాయి బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు స్వయంగా ఫోన్ చేసి పార్టీ తీరుతెన్నులపై వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ, పార్టీ పరిస్థితి, బలపడటానికి చేయాల్సిన మార్పులు చేర్పులు తదితర పలు అంశాల గురించి అడిగి తెలుసుకుంటున్నారని సమాచారం. కనుక లోక్‌సభ ఎన్నికలకు ముందు లేదా తర్వాత బిఆర్ఎస్ పార్టీలో సమూలంగా ప్రక్షాళన జరగవచ్చు.


Related Post