ముప్పై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్చులో ఉన్నారని లోక్‌సభ ఎన్నికల తర్వాత వారందరూ కాంగ్రెస్‌లోకి వచ్చేయడానికి సిద్దంగా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పినప్పుడే మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు వెళ్ళి సిఎం రేవంత్ రెడ్డితో భేటీ అవడంతో వారు పార్టీ మారబోతున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే ఈరోజు తెలంగాణ భవన్‌లో సునీతా లక్ష్మారెడ్డి వారు ముగ్గురుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, “మేము కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలలాగే ప్రజాప్రతినిధులమే. కనుక మా నియోజకవర్గంలో సమస్యలు, అభివృద్ధి గురించి సిఎంని కలిసి మాట్లాడటం తప్పని భావించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పధకాల గురించి మాకు కొన్ని సందేహాలున్నాయి. వాటి గురించి కూడా మేము సిఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరణ తీసుకొన్నాము.
అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రోటోకాల్, సెక్యూరిటీ సమస్యలు ఎదుర్కొంటున్నాము. వాటి గురించి కూడా సిఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని కోరాము. సిఎం ప్రజలను, ప్రజా పాలన ప్రతినిధులను కలిసి మాట్లాడేందుకు అంగీకరిస్తున్నారు కనుకనే మేము వెళ్ళి కలిసాము.
కానీ మేము ఆయనని కలిసి వస్తే మేము బిఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోబోతున్నట్లు మీడియాలో పుకార్లు మొదలైపోయాయి. మాకు అటువంటి ఆలోచన, ఉద్దేశ్యం రెండూ లేవు. మేము కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్‌లోనే పనిచేస్తాము,” అని చెప్పారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత తమ పార్టీ కార్యాలయంలోనే ఈ వివరణ ఇప్పించడం ద్వారా, వారిపై వస్తున్న ఈ పుకార్లకు సమాధానం చెప్పించిన్నట్లయింది. అయితే పార్టీ మారబోయే ఎమ్మెల్యేలు, నేతలు ఎప్పుడూ చెప్పే మాటలనే నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. కనుక వారు ఇప్పుడు కాకపోతే లోక్‌సభ ఎన్నికల తర్వాతైనా పార్టీ మారే అవకాశం ఉందనే భావించవచ్చు.