లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 16 నుంచి ప్రారంభం?

January 24, 2024


img

లోక్‌సభ ఎన్నికలు మరో రెండు మూడు నెలల్లో జరుగుతాయని అందరికీ తెలుసు. అయితే కేంద్ర ఎన్నికల కమీషన్‌ వాటి గురించి ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. 

కమీషన్ అధికారులు ఇప్పటికే పలు రాష్ట్రాలలో పర్యటిస్తూ ఎన్నికల సంఘం అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశమవుతూ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

తాజాగా ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి ఈ నెల 19వ తేదీన రిటర్నింగ్ అధికారులకు ఓ సర్క్యులర్ జారీ చేశారు. దానిలో ఏప్రిల్‌ 16వ తేదీన ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తూ అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. 

దీనిపై మీడియా వివరణ కోరగా కేంద్ర ఎన్నికల కమీషన్‌ స్పందిస్తూ, “సార్వత్రిక ఎన్నికల ప్రారంభం నుంచి ముగిసే వరకు జిల్లాల అధికారులు, రిటర్నింగ్ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది. ఆ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఓ తేదీని అనుకుంటాము. ఆ ప్రకారం ఏర్పాట్లు చేసుకోవలసిందిగా సూచిస్తుంటాము. ఇది ఆ ఏర్పాట్ల కోసమే తప్ప ఎన్నికలకు నిర్ధిష్టమైన తేదీ కాదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు దానిలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సాగుతుందో నిర్ధిష్టమైన తేదీలు ప్రకటిస్తాము,” అని మంగళవారం ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది.     

గత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్‌ 2019, మార్చి 10న షెడ్యూల్ ప్రకటించి ఏప్రిల్‌కు 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించి మే 23వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించింది. కనుక తాజా సర్క్యులర్ ప్రకారం ఇంచు మించు అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలు జరుగవచ్చని భావించవచ్చు.



Related Post