కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పధకాల హామీల అమలు గురించి తెలంగాణ ప్రజలు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వాటి అమలుకి కాంగ్రెస్ పెట్టుకున్న మూడు నెలల గడువు కోసం బిఆర్ఎస్ నేతలు రోజులు లెక్కపెట్టుకుంటూ మరీ ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలుచేయకుండా తప్పించుకోవడానికే రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయిందని కుంటిసాకులు చెపుతున్నారంటూ వాదిస్తున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కనుక జనవరి నెల బిల్లులు ఎవరూ కట్టవద్దని కేటీఆర్, హరీష్ రావు పదేపదే ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు తమ కరెంట్ బిల్లులను సోనియా గాంధీకి పోస్ట్ చేయాలని పిలుపునిస్తున్నారు.
ఈ నేపధ్యంలో బిఆర్ఎస్ నేతలకు షాక్ ఇస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉచిత విద్యుత్ హామీపై నేడు ఓ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి ఈ పధకాన్ని అమలుచేయబోతున్నట్లు తెలిపారు. రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వారికి మాత్రమే ఈ పధకం వర్తిస్తుందని చెప్పారు.
అంటే బిఆర్ఎస్ వాదిస్తున్నట్లు 201 యూనిట్లు వాడితే ఆ ఒక్క యూనిట్ బిల్లు చెల్లించాలని కాదు. ప్రతీ నెల సగటున 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడుకుంటున్నవారికి మాత్రమే ఈ పధకం వర్తిస్తుందన్న మాట!
ఈ పధకం రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు తోడ్పడటానికే తప్ప రైతు బంధు పధకంలా భూస్వాములకు తోడ్పడటం కోసం కాదు. కనుక ఈ విధానంలో నిరుపేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. పడితే అది రాజకీయాలు చేయడంగానే భావించవచ్చు.