మూడేళ్ళుగా తెలంగాణ ప్రజలను వాయగొట్టిన వైఎస్ షర్మిల, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులవడంతో ఏపీకి వెళ్ళిపోయారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడుతూనే వైఎస్ షర్మిల తన అన్న, సిఎం జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఇది ఆయనకు, వైసీపికి చాలా ఇబ్బందికరమే కానీ ఆమెను భరించకా తప్పదు. ఎదుర్కోకా తప్పదు.
నేటి నుంచి ఆమె ఏపీలో జిల్లా యాత్రలకు బయలుదేరారు. నేడు శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఏపీలో జగన్ పాలన ఏవిదంగా ఉందో అడిగి తెలుసుకున్నారు. అంటే ఏపీలో ఆమె డ్రామాలు మొదలుపెట్టేశారన్న మాట!
ఇదివరకు ఆమె తెలంగాణలో కూడా ఇలాగే నిరుద్యోగ దీక్షలు చేస్తూ, కేసీఆర్‌ని విమర్శిస్తూ రాష్ట్రంలో రాజకీయంగా గుర్తింపు పొందాలని తాపత్రయపడ్డారు. కానీ ఫలించలేదు.
చివరికి రేవంత్ రెడ్డి ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ తలుపులు మూసేయడంతో ఏపీలో వెళ్ళి పడ్డారు. కనుక ఇప్పుడు అన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు.
దీంతో ఏపీలో చాలా విచిత్రమైన రాజకీయాలు మొదలయ్యాయి. అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ నిజంగానే కత్తులు దూసుకుంటున్నారా లేక తమని మభ్యపెట్టేందుకు ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా?అనే అయోమయంలో పడుతున్నారు.