కార్యకర్తల మాట విని ఉంటే బిఆర్ఎస్ ఓడిపోయేదే కాదేమో?

January 21, 2024


img

బిఆర్ఎస్ నేతలు కేటీఆర్‌, హరీష్ రావు తమ పార్టీ ఓటమికి కాంగ్రెస్‌ పార్టీనే నిందిస్తున్నప్పటికీ, తమ పార్టీలో జరిగిన తప్పులను, లోపాలను గమనించేన్నట్లే ఉన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, “క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి పార్టీ కార్యకర్తలు ఈ సమావేశంలో మాకు తెలియని అనేక విషయాలు మా దృష్టికి తెచ్చారు. అందరూ చాలా మనసు విప్పి పార్టీ బాగోగుల గురించి మాట్లాడుతుంటే మళ్ళీ నాకు ఆనాటి పాత జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి. 

మనం ఇదేవిదంగా కలిసిమెలిసి పనిచేస్తూ లోక్‌సభ ఎన్నికలలో మన పార్టీని గెలిపించుకోవాలి. ఈ ఓటమి మనకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే. గతంలో కూడా మనం అనేక ఎదురుదెబ్బలు తిన్నాము. కానీ గట్టిగా నిలబడి పోరాడి పదేళ్ళు అధికారంలో ఉన్నాము. 

గ్రేటర్ పరిధిలో బీజేపీ అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఎక్కువ సీట్లు గెలుచుకొంది. కాంగ్రెస్‌, బీజేపీలు కుమ్మక్కు అవడం వలననే మనకు నష్టం జరిగింది. కానీ లోక్‌సభ ఎన్నికలలో ఎటువంటి పొరపాట్లకు తావీయకుండా గెలిచి మళ్ళీ మన సత్తా చూపిద్దాము,” అని అన్నారు. 

ఉద్యమాల కోసమే ఆవిర్భవించిన టిఆర్ఎస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక ఆ స్ఫూర్తిని, ఆ తీరుని పక్కన పెట్టేసి పక్కా రాజకీయ పార్టీగా మారిపోయింది. ఈ విషయం కేసీఆర్‌ స్వయంగా చెప్పుకున్నారు కూడా. ఇది సహజమే కానీ ఉద్యమంలో అందరినీ కలుపుకొని, అందరితో కలిసిపోతూ ముందుకు సాగిన కేసీఆర్‌, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే పూర్తిగా మారిపోయారు. 

ఉద్యమకారులను ఎలాగూ పక్కన పెట్టేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని, పార్టీని తన కనుసన్నలలో నడిపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలనే కేసీఆర్‌ పట్టించుకోనప్పుడు ఇక ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలను ఎక్కడ పట్టించుకొంటారు? అదే పార్టీ కొంప ముంచిందని  హరీష్ రావు చెపుతున్నారనుకోవచ్చు. ఇకనైనా బిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలను కూడా గౌరవిస్తే బిఆర్ఎస్ పార్టీ పునాదులు బలపడతాయి. 


Related Post