గత ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటిదైన మేడిగడ్డ బ్యారేజిలో 7వ బ్లాకులో కొంత మేర క్రుంగిన సంగతి తెలిసిందే. దీనిపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టగా 7వ బ్లాకుకి ఇరువైపులా ఉండే 6,8 బ్లాకులలో పియర్స్‌లో కూడా పగుళ్ళు ఏర్పడిన్నట్లు గుర్తించారు.
విజిలెన్స్ అధికారులు హైదరాబాద్‌లోని సాగునీటి శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అన్ని కార్యాలయాలలో ఇటీవల సోదాలు నిర్వహించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబందించి పలు ఆర్ధిక, సాంకేతిక అంశాలకు సంబందించి వివరాలను వాటిలో నమోదు చేయలేదని గుర్తించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాసితనం, నిర్వహణ లోపాలు కారణంగానే మేడిగడ్డ బ్యారేజి దెబ్బతిందని ప్రాధమికంగా గుర్తించారు. అయితే మేడిగడ్డ బ్యారేజి గత అక్టోబర్ నెలలో ఒకేసారి క్రుంగిపోలేదని, రెండు మూడేళ్ళ క్రితం నుంచే ఈ సమస్యలు మొదలైన్నట్లు విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు.
గత ప్రభుత్వం, ప్రాజెక్ట్ నిర్వహణ అధికారులు, నిర్మాణ సంస్థ పర్యవేక్షణ కొరవడం వలననే మేడిగడ్డ బ్యారేజి దెబ్బతిందని ప్రాధమికంగా నిర్ధారించారు. సుమారు 20 టన్నులు బరువు గల కాంక్రీట్ దిమ్మలు మేడిగడ్డ బ్యారేజిలో నీటి ఉదృతికి 100 మీటర్లు దూరం కొట్టుకుపోవడమే ఇందుకు నిదర్శనంగా కనబడుతోంది.
మేడిగడ్డ బ్యారేజిని రక్షణగా ఏర్పాటు చేసిన ఈ కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోవడంతో బ్యారేజి పిల్లర్ల పునాదులు బలహీనపడి ఉండవచ్చని భావిస్తున్నారు. నిపుణుల కమిటీ సమగ్ర విచారణలో మేడిగడ్డ బ్యారేజి దెబ్బ తినడానికి అసలు కారణాలు బయట పడతాయని విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు.
మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా దగ్గరుండి ప్రత్యేక శ్రద్దతో కాళేశ్వరం ప్రాజెక్టుని కేవలం మూడేళ్ళలో నిర్మించామని, ఇది ఇంజనీరింగ్ అద్భుతమని గొప్పలు చెప్పుకున్నారు.
కానీ ప్రాజెక్టు నిర్మించిన నాలుగేళ్ళకే అతి ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజిలో పిల్లర్లు ఒకదాని తర్వాత మరొకటి క్రుంగిపోతున్నాయిప్పుడు. హామీల అమలు గురించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్, హరీష్ రావులు మేడిగడ్డ బ్యారేజిలో ఏర్పడిన ఈ సమస్యల గురించి మాట్లాడటం లేదు.