తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకున్నాక శనివారం లండన్‌లో స్థిరపడిన తెలంగాణవాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని, మాజీ సిఎం కేసీఆర్‌ని ఉద్దేశ్యించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా ఆ పార్టీ నేతలకు ఇంకా బలుపు, పొగరు ఏమాత్రం తగ్గలేదు. వారి అహంకారం తగ్గించే బాధ్యత నేనే తీసుకుంటాను. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కనపడదు. ఆ పార్టీని 100 అడుగుల లోతు గొయ్యి తీసి పాతి పెడతాను.
ఇంట్లో పడుకున్న కేసీఆర్ పులి అని త్వరలోనే బయటకు రాబోతోందని బిఆర్ఎస్ నేతలు చెపుతున్నారు. రానీయండి... మేము కూడా దాని కోసమే బోను, వల సిద్దం చేసుకొని లోపల వేయడానికి ఎదురుచూస్తున్నాము. పులి బయటకు వస్తే మా కాంగ్రెస్ కార్యకర్తలే దానిని చెట్టుకి కట్టి వ్రేలాడదీస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం కబంద హస్తాల నుంచి విడిపించడంతో ఇప్పుడు అందరూ స్వేచ్ఛగా ఉన్నట్లు భావిస్తున్నారు.
కేసీఆర్ కుటుంబం పదేళ్ళలో రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని, అప్పుల పాలు చేసి మళ్ళీ నిసిగ్గుగా మా ప్రభుత్వంపై బురద జల్లుతోంది. బిఆర్ఎస్ హయాంలో అవినీతికి పాల్పడకపోతే అప్పులపై చర్చకు ఎందుకు భయపడుతోంది? కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు 25వరకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉండేది. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 5వ తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లించింది.
మా పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఇంకా ఎప్పుడు అమలుచేస్తామని బిఆర్ఎస్ పదేపదే ప్రశ్నిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజులలో ప్రతీ హామీని నెరవేర్చుతాము. లోక్‌సభ ఎన్నికలలో ఇక్కడ తెలంగాణలో, జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ఈసారి రాహుల్ గాంధీయే దేశానికి ప్రధాన మంత్రి అవుతారు,” అని అన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై అప్పుడే బిఆర్ఎస్ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ముందుగా ప్రభుత్వంలో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకున్నారు. కనుక కేటీఆర్, హరీష్ రావు ఎన్ని విమర్శలు చేస్తున్నా పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సిఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీపై యుద్ధం ప్రకటించారనుకోవచ్చు.