పదేళ్ళుగా తెలంగాణలో తిరుగులేని అధికారం చలాయించిన బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోవడం ఆ పార్టీ నేతలు జీర్ణించుకోవడం చాలా కష్టమే. అందుకే నెలరోజులు కూడా కాక మునుపే తమ ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ రావు అంతగా విరుచుకుపడుతున్నారని కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు.
అయితే బిఆర్ఎస్ అసహనానికి ఓటమి ఒక్కటే కారణమా? అంటే కాదనే చెప్పాలి. తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పాలన చేతకాక చేతులెత్తేస్తారని అనుకుంటే నెల రోజుల్లోనే ప్రభుత్వంపై పట్టు సాధించడమే కాకుండా రాష్ట్రంలో మంచి పేరు సంపాదించుకొంటుండటం, ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండటం, కేసీఆర్ ఇంటికే పరిమితం కావడం వంటివి కేటీఆర్, హరీష్ రావుల అసహనానికి అనేక కారణాలుగా కనిపిస్తున్నాయి.
అందుకే వారిరువురూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సిఎం రేవంత్ రెడ్డి దావోస్, లండన్ పర్యటనలు, అదానీతో భేటీ అవడం, రేవంత్ రెడ్డి భాష... ఇలా ప్రతీ అంశంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
దీనికంతటికి కారణం రేవంత్ రెడ్డి విదేశాలలో ఉండగానే బిఆర్ఎస్ పార్టీని 100 అడుగుల లోతున పాతిపెడతామని, లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం కూడా మరో కారణమే కావచ్చు. కానీ అంతకంటే పెద్ద కారణం మరొకటి కనిపిస్తోంది. సిఎం రేవంత్ రెడ్డి లండన్‌లో మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో భేటీ అవడమే!
ఇప్పటి వరకు కూడా మజ్లీస్, బిఆర్ఎస్ పార్టీలు మిత్రపక్షాలుగానే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలకడగా మనుగడ సాగించాలంటే మజ్లీస్ మద్దతు అవసరమని సిఎం రేవంత్ రెడ్డి భావిస్తుండవచ్చు. కనుక మజ్లీస్ మద్దతు పొందేందుకు మెల్లగా పావులు కడుపుతున్నట్లున్నారు. ఒకవేళ ఆయన ప్రయత్నాలు ఫలించి మజ్లీస్ కాంగ్రెస్‌వైపు మొగ్గితే, లోక్‌సభ ఎన్నికలలో ముస్లింలందరూ కాంగ్రెస్‌వైపు వెళ్ళిపోతే బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. బహుశః అందుకే కేటీఆర్, హరీష్ రావు ఇంతగా ఆవేశపడుతున్నట్లున్నారు.