తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ఘర్షణ పడుతూనే ఉన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి ఆమె నో చెప్పడమే ఇందుకు కారణం. మళ్ళీ ఇప్పుడు అదే కారణంగా సిఎం రేవంత్ రెడ్డికి ఆమెకు వివాదం తలెత్తబోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది.
కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది జూలై నెలలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు నియమించాలని సిఫార్సు చేయగా ఆమె తిరస్కరించారు. దానిపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆ కేసు తదుపరి విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.
కనుక ఆమె ఈ కేసు తేలే వరకు గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియమకానికి అంగీకరించకపోవచ్చు. ఈ విషయం సిఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. కనుక కేసు తేలే వరకు వేచి చూడక తప్పదు.
కానీ గవర్నర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్నందున ముందుగా ఆమెను కలిసి ఎమ్మెల్సీ అభ్యర్ధుల గురించి వివరించి ఆమె అనుమతి తీసుకున్నాక మంత్రి మండలి సిఫార్సు చేసేందుకు అవకాశం కూడా ఉంది.