దావోస్ పర్యటన ఫలించింది తెలంగాణకు రూ.37,870 కోట్లు పెట్టుబడులు

January 18, 2024


img

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి బృందం రాష్ట్రానికి రూ.37,870 కోట్లు పెట్టుబడులు సాధించింది. వాటిలో అదానీ, గోద్రెజ్, ఆరాజెన్, జెఎస్‌డబ్ల్యూ, వెబ్‌వర్క్స్, గోడి వంటి పలు సంస్థలున్నాయి. 

అదానీ గ్రూప్ రూ.1,200 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ స్థాపించేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. అదానీ గ్రూప్‌కే చెందిన ఆదాని గ్రీన్ ఎనర్జీ సంస్థ రూ.5,000 కోట్ల పెట్టుబడితో గ్రీన్ ఎనర్జీ పేరుతో 1,350 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన రెండు భారీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుంది.

మరో రూ.5,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ క్యాంపస్, చందన్‌వల్లిలో అదానీ కనెక్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ఆదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్కులో రూ.1,000 కోట్ల పెట్టుబడితో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, మిసైల్స్ తయారీ కేంద్రాని ఏర్పాటు చేస్తుంది. 

భారత్‌లో ప్రైవేట్ విద్యుత్ రంగంలో పేరుగాంచిన జెఎస్‌డబ్ల్యూ (జిందాల్ గ్రూప్) రూ.9,000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుంది. 

అంబుజా సిమెంట్స్ సంస్థ రూ.1,400 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 60 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేస్తుంది.   

గోడీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రాబోయే 5 ఏళ్ళలో రూ.8,000 కోట్ల పెట్టుబడితో గిగా సెల్ (విద్యుత్ వాహనాలలో ఉపయోగించే బ్యాటరీ సెల్స్ తయారీ) వివిద రకాల బ్యాటరీల పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది.

మొదటి దశలో 2.5 గిగా వాట్స్ సామర్ధ్యంతో బ్యాటరీ సెల్స్ ఉత్పత్తి, అసెంబ్లీ యూనిట్‌ని ఏర్పాటు చేస్తుంది. దీనిలో ప్రత్యక్షంగా 6,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. తర్వాత రెండో దశలో మరో 10 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన ప్లాంట్స్ ఏర్పాటు చేస్తుంది. 

వెబ్‌వర్క్స్ సంస్థ హైదరాబాద్‌లో ఇదివరకే 10 మెగావాట్స్ నెట్‌ వర్కింగ్ సామర్ధ్యం కలిగిన భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు దాని విస్తరణకు మరో రూ.4,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. 

ఆరాజాన్ లైఫ్ సైన్సస్ సంస్థ తమ మల్లాపూర్‌ ప్లాంట్ విస్తరణకు రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. ప్లాంట్ విస్తరణ ద్వారా మరో 1,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 

గోద్రెజ్ సంస్థ మలేసియాకు చెందిన సిమ్ డర్బీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే రూ.270 కోట్ల పెట్టుబడితో ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతోంది. ఇప్పుడు మరో రూ.1,000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో కెమికల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది.


Related Post