రేవంత్‌ దావోస్ వెళ్ళారు కానీ జగన్‌ మళ్ళీ డుమ్మా!

January 17, 2024


img

నెల రోజుల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి పెట్టుబడులు, పరిశ్రమల కోసం దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సుకు వెళ్ళారు. అక్కడ ఆయన ప్రయత్నాలు ఫలించనప్పటికీ, తనవంతు ప్రయత్నం చేశారు.

కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నప్పటికీ, ఏపీలో పరిశ్రమలు లేక యువత హైదరాబాద్‌, బెంగళూరులకు వలసలు పోతున్నప్పటికీ ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి మాత్రం దావోస్ సదస్సుకు హాజరుకాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ప్రస్తుతం ఆయన దృష్టి అంతా త్వరలో జరుగబోయే ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలపైనే ఉంది. వాటిలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు వైసీపి ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలను మార్చుకుంటూ చాలా బిజీగా ఉన్నారు. కనుక దావోస్ పర్యటనకు ఈ ఏడాది కూడా డుమ్మా కొట్టారు. 

ఆయన వెళ్ళలేకపోయినా ఏపీ పరిశ్రమలు, ఐ‌టి శాఖ మంత్రి గుడివాడ అమర్నాద్‌ని పంపించవచ్చు. కానీ ఆయన అంత సమర్ధుడు కాదని జగన్‌ భావిస్తున్నందునే వచ్చే ఎన్నికలలో ఆయనకు టికెట్‌ ఇవ్వలేనని చెప్పేశారు. 

ఏపీలోని జగన్‌ ప్రభుత్వం ఈ తీరు వలన తెలంగాణ రాష్ట్రానికి ఇంకా మేలే జరుగుతుంది. సిఎం రేవంత్‌ రెడ్డి, తెలంగాణ పరిశ్రమలు, ఐ‌టి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఆ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌లను వెంటబెట్టుకొని దావోస్ వెళ్ళి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరిపారు. అవి ఫలిస్తే తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు రావచ్చు.


Related Post