సినిమా హీరో, హీరోయిన్లు, వారి పాత్రలు, వేషధారణ వంటివి సమాజంలో యువతపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిసి ఉన్నప్పటికీ వారు సినిమాలలో చేయకూడని పనులే చేస్తుంటారు. ముఖ్యంగా హీరోలు మద్యం, పొగ త్రాగడం, హీరోయిన్లతో లిప్‌లాక్‌లు, రకరకాల ఆయుధాలతో విలన్లను నరికి చంపుతూ రక్తపుటేరులు పారిస్తుండటం, హీరోయిన్లు అశ్లీల ప్రదర్శనలు వంటివి చాలానే ఉన్నాయి. ఇవన్నీ యువత ఆలోచనలను, వారి జీవన శైలిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి.
ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌లో మహేష్ బాబు ఎరుపు రంగు చొక్కాతో కనిపించారు. ఆరోజు నుంచి ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఆ చొక్కాకు డిమాండ్ పెరిగి విపరీతంగా అమ్ముడుపోయాయని మహేష్ బాబు స్వయంగా చెప్పడమే ఇందుకు నిదర్శనం.
మహేష్ బాబు వంటి పెద్ద హీరో గుంటూరు కారం సినిమాలో మద్యం త్రాగుతూ, బీడీలు కాల్చడాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా స్టయిలిష్‌గా చూపారు. అంటే మద్యం త్రాగడం, బీడీలు లేదా సిగరెట్లు కాల్చడం చాలా గొప్ప విషయమన్నట్లు చెప్పారనుకోవచ్చు.
అయితే మహేష్ బాబు నిజ జీవితంలో వీటికి చాలా దూరంగా ఉంటారనే దాని కంటే సినిమాలో పొగ, మద్యం త్రాగుతూ చాలా స్టయిలిష్‌గా కనబడటమే యువతకు బాగా నచ్చుతుంది. కనుక వారు కూడా ఆయనను అనుకరించక మానరు.
కనుక మహేష్ బాబు తన సినిమా చూసి ఎవరూ బీడీలు, మద్యం త్రాగవద్దని గట్టిగా నొక్కి చెప్పే ప్రయత్నం చేయకపోగా, ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో “నేను పొగ తాగడాన్ని ప్రోత్సహించను. ఆ సినిమాలో నేను కాల్చినవి నిజమైన బీడీలు కావు. లవంగపు ఆకులతో తయారుచేసిన ఆయుర్వేదిక్ బీడీలు. వాటిలో పొగాకు ఉండదు. మింట్ ఫ్లేవర్‌తో ఉన్నందున వాటిని కాలుస్తూ షూటింగ్ పూర్తిచేశాను,” అని మాత్రమే చెప్పారు.