తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ సీట్లకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్ధులను ఖరారు చేసింది. బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ ఇద్దరి పేర్లు ఖరారు చేసింది. నామినేషన్స్ దాఖలు చేయడానికి గురువారంతో గడువు ముగుస్తుంది. కనుక రేపే ఇద్దరినీ నామినేషన్స్ వేయవలసిందిగా ఆదేశించింది.
వీరిద్దరూ శాసనసభ ఎన్నికలలో పోటీ చేయాలనుకున్నారు. కానీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు ఎన్నికలలో పోటీ చేయకుండా పార్టీ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశారు. వీరిలో బల్మూరి వెంకట్ విద్యార్ధి దశ నుంచే కాంగ్రెస్ పార్టీతో అనుబందం కలిగి ఉన్నారు. టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ పలు ఆందోళనలు నిర్వహించారు.
ఇక అద్దంకి దయాకర్ సిఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే. కనుక సిఎం రేవంత్ రెడ్డి సిఫార్సు మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరికీ టికెట్స్ ఖరారు చేసింది.
ఇది ఎమ్మెల్యేల కోటలో జరిగే ఎన్నికలు కనుక కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్ధిగా ప్రకటించినప్పుడే ఎమ్మెల్సీ పదవి ఇద్దరికీ ఖాయం అయిపోయిన్నట్లే.
ఈ నెల 29న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. శాసనసభలో గవర్నర్ కోటాలోని ఇద్దరు ఎమ్మెల్యేలను మినహాయిస్తే మొత్తం 117 మంది ఎమ్మెల్యేలున్నారు. కనుక ఒక్కో ఎమ్మెల్సీ గెలిచేందుకు కనీసం 59-60 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఉన్నారు. సీపీఐని కూడా కలుపుకుంటే 65 మంది అవుతారు.
ఈ రెండు సీట్లకు వేర్వేరుగా నోటిఫికేషన్స్ జారీ చేసినందున రెండు వేర్వేరు ఎన్నికలుగా పరిగణింపబడతాయి. కనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధులకు వేర్వేరుగా ఓట్లు వేయవచ్చు. కనుక ఈ రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడిపోయిన్నట్లే.
బిఆర్ఎస్ పార్టీకి 39, మజ్లీస్ ఏడుగురు ఎమ్మెల్యేలను కలుపుకున్నా 46 మందే అవుతారు. కనుక బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రాజీనామాలతో ఖాళీ అయిన ఈ రెండు సీట్లు కాంగ్రెస్ హస్తగతం కానున్నాయి.