కవితకు ఈడీ నోటీసు లోక్‌సభ ఎన్నికల కోసమేనా?

January 16, 2024


img

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మళ్ళీ కదలికలు మొదలయ్యాయి. బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీస్ పంపించింది. నేడు ఢిల్లీలో తమ కార్యాలయానికి ఈ కేసు తదుపరి విచారణకు హాజరుకావాలని కోరుతూ ఈడీ నోటీసు పంపింది. 

కానీ ఢిల్లీ ఈడీ కార్యాలయంలో తనను ఒంటరిగా ప్రశ్నించడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో ఉన్నందున ఈడీ విచారణకు హాజరుకాలేనని కల్వకుంట్ల కవిత వెంటనే సమాధానం పంపారు.

దీనిపై ఈడీ ఏవిధంగా స్పందిస్తుందో ఊహించవచ్చు. ఆమెకు మళ్ళీ నోటీస్ పంపిస్తుంది. ఒకవేళ అప్పుడూ హాజరుకాకపోతే సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తుంది. మొదటి పిటిషన్‌ సంగతే తేలనప్పుడు రెండోదీ తేలదు కనుక లోక్‌సభ ఎన్నికల వరకు ఈడీ, సుప్రీంకోర్టు కేసులు, నోటీసులు, విచారణ సాగడం ఖాయమే. 

వీటి వలన ఏం జరుగుతుంది? అంటే కేసు ముందుకు వెళ్ళదు కానీ ఈ కేసుల పేరుతో తెలంగాణలో మళ్ళీ బిఆర్ఎస్, బీజేపీల మద్య యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధంతో తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకు బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది.

దాంతో భీకర పోరాటాలు చేస్తున్నట్లు బీజేపీ నటిస్తుంది. రెండు పార్టీలు చేసుకునే ఈ పోరాటాలతో లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ప్రాధాన్యత తగ్గించి వీలైనన్ని ఎక్కున ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు ప్రయత్నించవచ్చు.

ఇంతకాలం మౌనంగా ఉండిపోయిన ఈడీ ఇప్పుడు నోటీస్ పంపించడం వెనుక ఇదే పరమార్థంగా కనిపిస్తోంది.

ఇదే కేసులో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ని కూడా లోపల వేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని పేర్కొన్న ఏపీ వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఈడీ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు! అంటే బీజేపీ రాజకీయ అవసరాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ట్రీట్‌మెంట్ అన్నమాట! 


Related Post