ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు భృతి ఇవ్వాలి: హరీష్

January 14, 2024


img

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పధకం వలన రాష్ట్రంలో ఆటో రిక్షా డ్రైవర్లకు ఆదాయం లేకుండా పోయిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

మహాలక్ష్మి పధకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండటాన్ని హరీష్ రావు స్వాగతిస్తూనే, ఒకరికి మేలు చేస్తూ మరొకరి పొట్ట కొట్టడం సరికాదని అన్నారు. కనుక రాష్ట్రంలో ఆటో డ్రైవర్లందరికీ నెలకు రూ.15,000 చొప్పున భృతి ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

ఆటోలు తిప్పుకుంటూ కుటుంబాలను పోషించుకునే ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రోడ్డున పడేసిందని హరీష్ రావు అన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం న్యాయం చేసేవరకు వారి తరపున బిఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని అన్నారు.

మహాలక్ష్మి పధకం వలన బస్సులలో రద్దీ పెరిగిందని కనుక ప్రభుత్వం మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా బస్సులు నడిపించాలని హరీష్ రావు కోరారు.

రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఆటో డ్రైవర్లున్నారని హరీష్ రావే చెపుతున్నారు. అంతమందికి నెలకు రూ.15,000 చొప్పున భృతి ఇవ్వాలని డిమాండ్ చేయడం రాజకీయం చేయడమే.

ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి కుంటిసాకులు చెప్పి ఇవ్వకుండా ఎగవేసినప్పుడు, ఆటో డ్రైవర్లకు భృతి రూ.15,000 చొప్పున చెల్లించాలని అడగడాన్ని ఏవిదంగా సమర్ధించుకోగలరు? 

మహాలక్ష్మి పధకం వలన ఆటో రిక్షా డ్రైవర్లు ఆదాయం కోల్పోతున్న మాట వాస్తవమే. అలాగే టిఎస్‌ఆర్టీసీ కూడా భారీగా ఆదాయం కోల్పోతోంది. కనుక ఈ పధకంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి పరిమిత బస్సులకు మాత్రమే దీనిని వర్తింపజేస్తే మంచిది.


Related Post