కాంగ్రెస్‌ వల్లనే రైతుబంధు ఆగింది: మంత్రి హరీష్

November 27, 2023


img

తెలంగాణ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఈసీని కోరినమాట నిజం. అదేవిదంగా రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి పోలింగ్‌కు ముందు రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతించిన మాట కూడా వాస్తవం.

పోలింగ్ తేదీలోగా రైతుబంధు నిధులు రైతుల ఖాతాలో పడతాయని మంత్రి హరీష్ రావు చెప్పుకోవడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని చెపుతూ ఈసీ నిధుల విడుదలని నిలిపివేయించింది. దీంతో ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ఓట్ల రూపంలో పొందాల్సిన లబ్ధి కోల్పోయే అవకాశం ఉంది.

బిఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తున్న మంత్రి హరీష్ రావు వలననే రైతుబంధు నిలిచిపోయిందని ఈసీ లేఖలో స్పష్టమైంది. సహజంగానే ఇది మంత్రి హరీష్ రావుకు చాలా ఇబ్బందికరంగా మారింది. కనుక ఆయన దీనికి తాను కాదు... కాంగ్రెస్ పార్టీయే కారణమని వాదించడం మొదలుపెట్టారు. 

“రైతు బంధుపై కాంగ్రెస్ కుట్ర మరోసారి బయటపడింది. రైతులకు పంట సాయం పంపిణీ చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ కుట్ర చేసింది. టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ రైతు బంధుపై ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే నిర్ణయం తీసుకున్నది.

రైతుబంధును కాంగ్రెస్ పార్టీనే ఆపింది అనడానికి ఇదే నిదర్శనం. రైతులారా.. తెలంగాణ ప్రజలారా.. కాంగ్రెస్ కుట్రలను అర్థం చేసుకోండి,” అంటూ మంత్రి హరీష్ రావు ట్విట్టర్‌లో ఓ సందేశం పెట్టారు. రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రెస్‌ నేత నిరంజన్ ఈసీని కోరిన్నట్లు న్యూస్ పేపర్లో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను దానికి జత చేశారు. 

అయితే రైతుబంధుతో బిఆర్ఎస్ పార్టీ ఓటర్లను ప్రలోభపెట్టాలని ప్రయత్నిస్తోంది కనుక ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు దానిని నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ మొదటే ఫిర్యాదు చేసింది. అందులో ఏమీ రహస్యం లేదు. కనుక నిరంజన్ కావచ్చు లేదా మరో పార్టీ నేత కావచ్చు... ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రైతుబంధుని నిలిపివేయాలని ఈసీని కోరితే అదేమీ తప్పు కాదు. కానీ తప్పు అన్నట్లు మంత్రి హరీష్ రావు వాదిస్తుండటమే తప్పు కదా?


Related Post