మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్ విజయం సాధించబోతోందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు టిఆర్ఎస్ నేతలకు ముఖ్యంగా సిఎం కేసీఆర్‌కు చాలా ఊరటనిచ్చేవే. బహుశః అందుకే కేసీఆర్ నిన్న హుషారుగా ప్రెస్‌మీట్ పెట్టిన్నట్లున్నారు. మునుగోడులో గెలిస్తే కేసీఆర్ తర్వాత కార్యక్రమం ఏమిటి?అంటే ముందుగా బిఆర్ఎస్ పార్టీని సిద్దం చేసుకొని దానిని ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు వీలుగా టిఆర్ఎస్ ముఖ్యనేతలకు బిఆర్ఎస్‌లో పదవులు, బాధ్యతలు అప్పగించవచ్చు. ఆ తర్వాత వారిని వెంటబెట్టుకొని మరోసారి అన్ని రాష్ట్రాలలో పర్యటించే అవకాశం ఉంది.
త్వరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక కేసీఆర్ ముందుగా ఆ రెండు రాష్ట్రాలలో పర్యటించి, తనతో కలిసివచ్చే పార్టీలకు మద్దతు ప్రకటించవచ్చు. కేసీఆర్ ఇప్పటికే ఆమాద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో, అలాగే గుజరాత్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు వాఘేలాతో సత్సంబంధాలు ఏర్పరచుకొన్నారు. గుజరాత్ ఎన్నికలలో ఆమాద్మీ పోటీ చేయబోతోంది. కనుక కేసీఆర్ వారిరువురికీ మద్దతు ప్రకటించి వీలైతే బిఆర్ఎస్ తరపున అభ్యర్ధులను నిలబెట్టే ప్రయత్నం చేయవచ్చు.
మరోసారి రాష్ట్ర పర్యటనలు చేసి తనతో కలిసి వచ్చే బిజెపియేతర పార్టీలతో చర్చలు జరిపిన తర్వాత ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలలో వరుసగా కొన్ని బహిరంగసభలు నిర్వహించవచ్చు. ఫామ్‌హౌస్ ఆడియో, వీడియోలను బయటపెట్టి, బిజెపియేతర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు మోడీ ప్రభుత్వం ఏవిదంగా కుట్రలు జరుపుతోందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయవచ్చు.
తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రకు సంబందించి సాక్ష్యాధారాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపుతామని కేసీఆర్ చెప్పారు కనుక ఇదే అంశంపై న్యాయపోరాటం కూడా మొదలుపెట్టవచ్చు. తద్వారా దేశవ్యాప్తంగా కేసీఆర్‌కు, బిఆర్ఎస్ పార్టీకి మరింత ఉచిత ప్రచారం, గుర్తింపు, ఆదరణ పెరిగే అవకాశం ఉంటుంది.
ఇక రాష్ట్ర స్థాయిలో కూడా కేసీఆర్ చేయవలసిన కొన్ని పనులు కనిపిస్తున్నాయి. ముందుగా బిజెపిలో చేరిన టిఆర్ఎస్ నేతలని వెనక్కి రప్పించుకొంటూనే ఆ పార్టీని కూడా నిర్వీర్యం చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేయవచ్చు. కనుక రాబోయే ఏడాదిన్నర కాలంలో సిఎం కేసీఆర్ చాలా బిజీ అయిపోవచ్చు. కనుక కేటీఆర్‌ని ముఖ్యమంత్రిగా చేస్తారా లేక కేంద్ర ప్రభుత్వం వలన తన ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉన్నందున ముఖ్యమంత్రిగా కేసీఆరే మరికొంతకాలం కొనసాగుతారా అనే దానిపై ఈ ఏడాది చివరిలోగా పూర్తి స్పష్టత రావచ్చు.