శాసనసభ ఎన్నికలలో లేదా లోక్‌సభ ఎన్నికలలో గెలిచేందుకు రాజకీయ పార్టీలు తమ ముందున్న అన్ని మార్గాలను ఉపయోగించుకొంటున్నాయంటే అర్దముంది. కానీ మునుగోడు ఉపఎన్నికలతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడదు... ఉన్న ప్రభుత్వం కూలిపోదు. ఈ ఉపఎన్నికలు కేవలం టిఆర్ఎస్, బిజెపిల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరు మాత్రమే. అందుకే ఈ ఉపఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడటంతో దీనికి అనవసర ప్రాధాన్యత ఏర్పడిందని అందరికీ తెలుసు.
ఓ పక్క మునుగోడులో పోలింగ్ కొనసాగుతున్నా, ఇంకా ఓటర్లను మభ్యపెట్టి వారి మనసు మారేలా చేసి, వారి ఓట్లు కూడా తమ పార్టీకే పడేలా చేసుకొనేందుకు టిఆర్ఎస్, బిజెపిలు మైండ్ గేమ్స్ ఆడుతున్నాయి. నీతి,నిజాయితీ, ధర్మపోరాటం, న్యాయం అంటూ నీతులు చెప్పే టిఆర్ఎస్, బిజెపిలనే వేలెత్తి చూపే పరిస్థితి నెలకొంది.
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి వ్రాసిన్నట్లు చెప్పబడుతున్న ఓ లేఖ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మునుగోడు ఉపఎన్నికలలో బిజెపి ఓడిపోబోతోందని అందుకు తాను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలనుకొంటున్నట్లు బండి సంజయ్ సంతకంతో ఉందది. దానిని ఆయన ఖండించి ఇది మునుగోడు ఓటర్లను మభ్యపెట్టేందుకు టిఆర్ఎస్ సృష్టించిన నకిలీ లేఖ అని ఆరోపించారు.
ఈరోజు ఓ పక్క పోలింగ్ జరుగుతుంటే, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి సిఎం కేసీఆర్‌ని కలిశారని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీలో బ్రేకింగ్ వార్త ప్రసారం చేసింది. దానిపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ, “ఈ వార్తను నేను ఖండిస్తున్నాను. నేను సిఎం కేసీఆర్‌ని కలవలేదు. ఇటువంటి అసత్య వార్తలను ప్రసారం చేసే స్థాయికి ఎన్టీవీ దిగజారిపోయింది. దాని చేత ఈవిదంగా ఎవరు చెప్పించారో అర్దమవుతూనే ఉంది. ఓ మహిళనైన నన్ను ఎదుర్కోలేక టిఆర్ఎస్, బిజెపిలు కలిసి ఇలాంటి నీచానికి దిగజారిపోయాయి. త్వరలోనే ఎన్టీవీకి నేను లీగల్ నోటీస్ ఇచ్చి కోర్టుకి ఈడ్వబోతున్నాను,” అని అన్నారు.
ఈ ఉపఎన్నికలలో పోటీ ప్రధానంగా టిఆర్ఎస్, బిజెపిల మద్య ఉన్నప్పటికీ కాంగ్రెస్‌తో సహా మొత్తం 47 మంది పోటీ చేస్తున్నందున వారందరి మద్య ఓట్లు చీలి రెండు పార్టీలకు నష్టం కలిగే అవకాశం ఉంది. కనుక కొద్దిపాటి తేడాతో వాటిలో ఏదో ఓ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆ తేడా చాలా తక్కువగా ఉంటుంది కనుక కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లను తమపార్టీకి మళ్లించుకోగలిగితే విజయవకాశాలు మెరుగుపడతాయనే దురాలోచనతోనే టిఆర్ఎస్, బిజెపిలలో ఏదో ఓ పార్టీ ఈవిదంగా మైండ్ గేమ్ ఆడుతున్నట్లు అర్దమవుతోంది. ఇవన్నీ చూస్తున్న సామాన్య ప్రజలు ఓ ఉపఎన్నికలో గెలవడానికి ఇంత నీచరాజకీయాలు చేయడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు.