ప్రస్తుతం తెలంగాణలో భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ, “టిఆర్ఎస్, బిజెపిల మద్య రహస్య సంబంధాలున్నాయని, మోడీ కనుసన్నలలోనే కేసీఆర్ పనిచేస్తుంటారని, అటువంటి పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ పొత్తులు పెట్టుకోదన్నారు. కేసీఆర్ వాపు నుంచి బలుపు అనుకొంటున్నారని, రేపు గ్లోబల్ పార్టీ పెట్టినా పెట్టుకోవచ్చునని” ఎద్దేవా చేశారు.
ఇప్పటికే ఈ విమర్శలకు మంత్రి కేటీఆర్ ఘాటుగా జవాబు ఇచ్చారు. ఇప్పుడు మంత్రి జగదీష్ రెడ్డి కూడా రాహుల్ గాంధీకి చురకలు వేశారు.
“టిఆర్ఎస్, బిజెపిల మద్య ఎటువంటి సంబందాలు లేవు కానీ కాంగ్రెస్, బిజెపిల మద్య చక్కటి అవగాహన ఉందని చెప్పగలను. పార్లమెంటులో రాహుల్ గాంధీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని కౌగలించుకొన్నప్పుడే ఆ రెండు పార్టీల మద్య బలమైన సంబంధం ఉందని స్పష్టమైంది. తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ త్వరలో ఎన్నికలు జరుగబోతున్న గుజరాత్‌లో ఎందుకు పాదయాత్ర చేయకుండా వెళ్ళిపోబోతున్నారు?అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆయన అవసరం చాలా ఉన్నప్పటికీ అటువైపు ఎందుకు తొంగి చూడటం లేదంటే కాంగ్రెస్, బిజెపిల మద్య రహస్య సంబందాలు ఉన్నందునే. రాహుల్ గాంధీకి మా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే స్థాయి లేదు,” అని అన్నారు.
మంగళవారం సాయంత్రం వరకు మునుగోడు ఉపఎన్నికల ప్రచారం సాగుతున్న సమయంలోనే రాహుల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. మునుగోడులో ఒంటరి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి మద్దతుగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉంటే ఫలితాలు తారుమారయ్యేవి. కానీ ఆమె పరిస్థితి తెలిసి కూడా రాహుల్ గాంధీ అటువైపు తొంగి చూడకుండా సరదాగా అందరితో కబుర్లు చెప్పుకొంటూ, మద్యమద్యలో రన్నింగ్ రేస్ చేస్తూ, మేళతాళాలతో ఊరేగింపుగా అట్టహాసంగా పాదయాత్ర చేసుకొంటూ ముందుకు సాగిపోతున్నారు. మునుగోడు వైపు తొంగిచూడని రాహుల్ గాంధీ, గుజరాత్‌లో పర్యటించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొంటారని ఆశించడం అత్యాశే కదా?