మునుగోడు ఉపఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసినప్పటికీ టిఆర్ఎస్, బిజెపిల మద్య రాజకీయ చదరంగం ఇంకా జోరుగా సాగుతూనే ఉంది. సోషల్ మీడియాలో నిన్న బండి సంజయ్ లెటర్ ప్యాడ్ మీద ఆయన సంతకంతో వ్రాసిన ఓ లేఖ ప్రత్యక్షమైంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి బండి సంజయ్ ఆ లేఖ వ్రాసినట్లు అర్దమవుతోంది.
దానిలో ఏముందంటే, “మునుగోడు ఉపఎన్నికలలో వందలాది మంది మన పార్టీ కార్యకర్తలు రేయింబవళ్లు ఎంతగానో శ్రమించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, ముందు అనుకొన్నట్లు మన అభ్యర్ధికి కాంగ్రెస్ శ్రేణుల నుంచి మద్దతు లభించలేదు. ఆయన కూడా మన బిజెపి శ్రేణులతో మమేకం కాలేకపోయారు. ఈ కారణంగా మునుగోడులో మన ఎన్నికల ప్రచారంలో వారికీ మనకీ మద్య సమన్వయం లోపించింది. ఈ నేపధ్యంలో మునుగోడులో మనకు విజయావకాశాలు లేనందున ఎన్నికల ప్రచారానికి మన జాతీయస్థాయి నాయకులు ఎవరూ రావద్దని సూచించాను. ఉపఎన్నికలలో పార్టీ ఓడిపోతే అందుకు నైతిక బాధ్యత వహిస్తూ నేను నా పదవికి రాజీనామా చేసి తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నాను,” అని బండి సంజయ్ సంతకంతో ఉంది.
మునుగోడులో ఎన్నికల ప్రచారానికి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు వస్తారని జోరుగా ప్రచారం సాగినప్పటికీ ఎవరూ రాలేదు. బండి సంజయ్ లేఖలో కూడా అదే ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపిలోకి వచ్చినందున, మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఆయన వెంటవస్తారని బిజెపి భావించడం సహజం. కానీ రాలేదని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంతంగా ఎన్నికల ప్రచారం చేసుకొన్నారు. కొన్నిసార్లు మాత్రమే బిజెపి నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. కనుక లేఖలో పేర్కొన్నట్లు ఆయనకు, బిజెపి నేతలకు మద్య సమన్వయం కొరవడిందని అర్దమవుతోంది. కనుక ఆ లేఖలో వ్రాసిన విషయాలన్నీ నిజమేనని అనిపిస్తున్నాయి. ఈ లేఖతో మునుగోడులో బిజెపి ఓడిపోబోతోందని తెలియజెపుతూ బండి సంజయ్ దానికి ముందే వివరణ ఇచ్చుకొన్నట్లు ఉంది.
అయితే బండి సంజయ్ దీనిని తీవ్రంగా ఖండించారు. ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా విఫలం అయిన తర్వాత చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న టిఆర్ఎస్ నకిలీ లేఖతో మరో సరికొత్త డ్రామా మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి మునుగోడు ఉపఎన్నికలలో బిజెపి గెలిచిన తర్వాత సిఎం కేసీఆర్ రాజీనామా చేయబోతున్నారని బండి సంజయ్ వాదించారు.
బండి సంజయ్ చెపుతున్నట్లు ఒకవేళ ఈ లేఖ నకిలీదే అయితే బిజెపి ఓడిపోబోతోందంటూ పోలింగ్‌కు ముందు మునుగోడు ఓటర్లకు నమ్మకం కలిగించేందుకు టిఆర్ఎస్ పార్టీయే ఈ లేఖ సృష్టించి ఉండవచ్చు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం చేయడం వీలుపడదు కనుక ఇటువంటి వ్యూహాలతో ప్రత్యర్ధిని ఓడించాలని ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు. మునుగోడులో టిఆర్ఎస్, బిజెపిలలో ఏ పార్టీ గెలుస్తుందనేది మరో నాలుగు రోజులలో తేలిపోతుంది. కానీ అప్పుడు కేసీఆర్, బండి సంజయ్ కానీ రాజీనామా చేయరని అందరికీ తెలుసు.