రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో సాగుతోంది. రాహుల్ గాంధీ నిన్న మీడియాతో మాట్లాడుతూ, అవినీతికి మారుపేరుగా నిలిచిన టిఆర్ఎస్‌తో ఎన్నడూ పొత్తులుపెట్టుకోబోమని, కేసీఆర్ తనని తాను చాలా ఎక్కువగా ఊహించుకొంటున్నారని, ఆయన గ్లోబల్ పార్టీ పెట్టుకొన్నా తమకేమీ అభ్యంతరం లేదంటూ ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ విమర్శలకు మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. “అంతర్జాతీయ నాయకులైన రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం అమెధీ కూడా గెలవలేరు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి విమర్శిస్తున్నారు. దేశానికి ప్రధానమంత్రి కావాలనుకొంటున్న రాహుల్ గాంధీ ముందు ఆయన సొంత నియోజకవర్గంలో ప్రజలను మెప్పించి ఎంపీగా ఎన్నికైతే బాగుంటుంది,” ట్వీట్ చేశారు.
యూపీయే హయాంలో ప్రధాని పదవి చేపట్టాలనుకొన్న సోనియా గాంధీ అది సాధ్యం కాకపోవడంతో తన కుమారుడు రాహుల్ గాంధీనైనా ఆ కుర్చీలో కూర్చోబెట్టాలని ప్రయత్నించారు. కానీ హేమాహేమీలైన కాంగ్రెస్ నేతలు అండగా పక్కన నిలబడుతున్నప్పటికీ రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టడానికి భయపడ్డారు!
ఆ తర్వాత 2019 ఎన్నికలలో ఆయన ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది. దాంతో కాంగ్రెస్ పగ్గాలు కూడా వదిలేశారు! ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు ఎంత ఒత్తిడి చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం లేదు.
ఓ ప్రాంతీయ పార్టీని పెట్టి దాంతో పదేళ్ళు తమ యూపీయే ప్రభుత్వంతోనే కోట్లాడి తెలంగాణ సాధించుకొని, రాష్ట్రాన్ని అన్ని విదాల అభివృద్ధి చేసుకొని, ఇప్పుడు టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్‌గా మార్చుకొని జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడానికి వస్తున్న తెలంగాణ సిఎం కేసీఆర్‌ను వేలెత్తి చూపే అర్హత సొంత పార్టీని నడిపించడానికి భయపడే రాహుల్ గాంధీకి ఉందా?