మునుగోడులో అంత సీన్ లేదట... నిరాశలో ఓటర్లు!

November 01, 2022


img

మునుగోడు ఉపఎన్నికలలో రెండు ప్రధానపార్టీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నాయని, ఓటర్లను ఆకట్టుకోవడానికి భారీగా బహుమతులు, డబ్బు, మద్యం పంచిపెడుతున్నాయని మీడియాలో ఒకటే వార్తలు వస్తుండటంతో రాష్ట్ర ప్రజలందరూ అవి చూసి మునుగోడు ఓటర్ల పంటపండిందని తమ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే బాగుండేదని అనుకొంటున్నారు. మునుగోడు ఉపఎన్నికలలో ఈ స్థాయిలో ఉంటాయని ముందే ఊహించిన ఇతర ప్రాంతాలలో స్థిరపడిన కొందరు స్థానికులు, ఎన్నికలు వస్తాయని గ్రహించగానే తమ ఓట్లను మునుగోడుకి మళ్ళీ మార్పించుకొన్నట్లు తెలుస్తోంది. 

మునుగోడులో కులపెద్దలకు రెండు పార్టీలు పోటాపోటీగా భారీగా నగదుతో పాటు ఖరీదైన గిఫ్టులు ఇస్తున్నాయని, అదే.. 10-15 ఓట్లు వేయించగలిగేవారికి స్మార్ట్ టీవీలు, ఫ్రిజ్జులు వంటి ఖరీదైన  ఇస్తున్నారంటూ ఆ మద్యన ఊహాగానాలు వినిపించాయి. ఒక్కో ఓటుకి రూ.10 వేలు వరకు ఇవ్వబోతున్నారని జోరుగా ప్రచారం సాగింది. దాంతో రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో, విదేశాలలో ఉన్న వారి బంధువులు ఫోన్లు చేసి మునుగోడులో ఎంత రేటు పలుకుతోంది?అని అడిగి తెలుసుకొంటున్నారు. 

కానీ తాజా సమాచారం ప్రకారం మునుగోడు మండల కేంద్రంలో ఒక్కో ఓటుకి రూ.4,000 చొప్పున పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇక చౌటుప్పల్ పరిధిలోని ఓ గ్రామంలో రూ.3,000 చొప్పున పంచిపెట్టినట్లు తెలుస్తోంది. కనీసం 6-7,000 అయినా వస్తుందనుకొంటే రూ.3-4,000తోనే సరిపెడుతుండటంతో మునుగోడు ఓటర్లు తీవ్ర నిరాశ, అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎల్లుండి ఉదయం 7 గంటలకి పోలింగ్ జరిగేవరకు ఇంకా సమయం ఉంది కనుక మునుగోడు ఓటర్లు ఆశగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఈ డబ్బు, మద్యం, చికెన్, మటన్ పంపిణీలో ద్వితీయశ్రేణి నాయకులు చేతివాటం చూపించి భారీగా నొక్కేస్తుండటంతో మూడు ప్రధానపార్టీలు, టోకెన్ సిస్టమ్ అమలుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారానికి, సభలకు హాజరయ్యేందుకు ఈవిదంగానే ముందుగా టోకెన్లు పంపిణీ చేశారు. దాంతో ద్వితీయశ్రేణి నాయకులు నొక్కుడు చాలా వరకు అదుపుచేయగలగడంతో ఓట్లు కొనుగోలుకి కూడా అదే విధానం అమలుచేస్తున్నట్లు తెలుస్తోంది. 

ముందుగా పార్టీ ముఖ్యనేతలు ఓటర్లతో మాట్లాడుకొన్నాక ఎంతమంది తమకు నమ్మకంగా ఓట్లు వేస్తారో లెక్కకట్టుకొని అన్ని టోకెన్లు తమ అనుచరులకు ఇస్తారు. వారు ఓటర్లకు వాటిని పంచిపెడతారు. ఒకవేళ పట్టుబడినా అవి కేవలం టోకెన్లు మాత్రమే కనుక డబ్బు పోదు. ఎన్నికల సంఘం కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ టోకెన్లు తీసుకొన్న ఓటర్లు, వారికి చెప్పిన నేతని కలిసి డబ్బు తీసుకోవచ్చు. మద్యం బాటిల్స్, చికెన్, మటన్ పంపిణీకి కూడా ఇప్పుడు ఇదే విధానం అమలుచేస్తున్నట్లు తెలుస్తోంది.


Related Post