ఆర్టీసీ కార్మికులపై టిఆర్ఎస్‌ ఒత్తిళ్ళు?

November 01, 2022


img

మునుగోడు ఉపఎన్నికల కారణంగా నియోజకవర్గంలో సామాన్య ప్రజలు సైతం రాజకీయ పార్టీల నుంచి తీవ్ర ఒత్తిళ్ళు భరించాల్సివస్తోంది. ముఖ్యంగా అధికార టిఆర్ఎస్‌ నుంచి ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటున్నాయి. ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌కు ఓట్లు వేయకపోతే సంక్షేమ పధకాలు నిలిపివేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి బెదిరించినందుకు కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఆయనను రెండు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. 

తాజాగా టీఎస్‌ఆర్టీసీలో టిఆర్ఎస్‌ అనుబంద యూనియన్ టీఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధామస్ రెడ్డి, ముఖ్య సలహాదారు బోయపల్లి యాదయ్య సోమవారం చండూరులో యూనియన్ సమావేశంలో మాట్లాడుతూ, “మునుగోడులోని ఆర్టీసీ కార్మికులందరూ టిఆర్ఎస్‌కే ఓట్లు వేయాలి. మన వేతన సవరణకు, యూనియన్ల పునరుద్దరణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. చండూరులో బస్ డిపో కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కనుక మనకు మేలు జరగాలన్నా, మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెండాలన్నా అందరూ టిఆర్ఎస్‌కే ఓట్లు వేసి గెలిపించాలి,” అని అన్నారు. 

టీఎంయు టిఆర్ఎస్‌ అనుబంద సంఘం కనుక దాని యూనియన్ నేతలు సహచర కార్మికులను ఈవిదంగా కోరడంలో తప్పు లేదు. కానీ వేతన సవరణకు ఈ ఉపఎన్నికతో ముడిపెట్టి మాట్లాడటమే అభ్యంతరకరం. ఎందుకంటే వేతన సవరణ అనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలోని టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు సంబందించిన విషయమే తప్ప ఒక్క మునుగోడు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన విషయం కాదు. కానీ మునుగోడులోని ఆర్టీసీ కార్మికులు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌కు ఓట్లు వేస్తే వేతన సవరణ జరుగుతుందన్నట్లు యూనియన్ నేతలు మాట్లాడటం వారిని ఒత్తిడి చేయడమే. 

ఇక  సమ్మె తర్వాత టీఎస్‌ఆర్టీసీలో యూనియన్లు ఉండొద్దని సిఎం కేసీఆర్‌ గట్టిగా చెప్పడమే కాక యూనియన్లను నిర్వీర్యం చేశారు. కానీ ఇప్పుడు టిఆర్ఎస్‌ అనుబంద యూనియన్ నేతలు మళ్ళీ యూనియన్ల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎన్నికలొస్తే యూనియన్లు అవసరం లేకుంటే వాటితో టీఎస్‌ఆర్టీసీకి నష్టం అనుకోవాలా? తెలంగాణలో ఏవిదంగా అయితే టిఆర్ఎస్‌ ఒక్కటే ఉండాలని కేసీఆర్‌ కోరుకొంటున్నారో, టీఎస్‌ఆర్టీసీలో కూడా టీఎంయు ఒక్కటే ఉంటే ఎన్నికలప్పుడు టిఆర్ఎస్‌కు ఈవిదంగా ఉపయోగపడుతుంది కదా?రాజకీయాలను పార్టీల వరకే పరిమితం చేసుకోవాలి కానీ ఈవిదంగా అన్ని రంగాలకు వ్యాపింపజేసుకొంటే చివరికి ఆయా రంగాలు కూడా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. 


Related Post