రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ప్రవేశించింది. ఈ సందర్భంగా తిమ్మాపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
• తెలంగాణలో టిఆర్ఎస్‌తో పొత్తులు పెట్టుకోవద్దని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. నేను వారి నిర్ణయానికి పూర్తి మద్దతు తెలుపుతున్నాను. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసి తెలంగాణలో అధికారంలోకి వస్తుంది.
• ఇక్కడ టిఆర్ఎస్, అక్కడ బిజెపి ప్రభుత్వాలు వ్యవస్థలన్నిటినీ నాశనం చేసి రెండూ నిరంకుశ అప్రజాస్వామిక పాలన చేస్తున్నాయి.
• మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్, బిజెపిలు పోటీలు పడి డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నాయి. వాటికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న టిఆర్ఎస్ వంటి పార్టీతో ఎన్నడూ పొత్తులు పెట్టుకోబోము.
• టిఆర్ఎస్ తనని తాను చాలా ఎక్కువగా ఊహించుకొంటూ జాతీయ పార్టీ, గ్లోబల్ పార్టీ పెట్టుకొంటే అభ్యంతరం లేదు.
• భారత్ జోడో ఏదో సరదా కోసం చేస్తున్న యాత్ర కాదు. ఇది ఖచ్చితంగా రాజకీయ యాత్రే. దీంతో దేశానికి, కాంగ్రెస్ పార్టీకి కూడా మేలు కలుగుతుందనే నేను భావిస్తున్నాను. ముఖ్యంగా బిజెపి విచ్ఛిన్నకర రాజకీయాల నుంచి దేశాన్ని కలిపి ఉంచేందుకు ఈ యాత్ర ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు విచ్ఛిన్నకరమైన శక్తులకు, దేశాన్ని సంఘటిత పరిచే శక్తులకు మద్య జరిగే పోరాటంగా ఉండబోతున్నాయి.
• ఈ యాత్రలో నేను చాలా విషయాలు నేర్చుకొంటున్నాను. యాత్ర ముగిసిన తర్వాతే రాజకీయ అంశాల గురించి మాట్లాడుతాను.
రాహుల్ గాంధీ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీతో పొత్తులు పెట్టుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చెప్పారంటే, కాంగ్రెస్ పార్టీని కలుపుకుపోకుండా బిజెపి ఎదుర్కోవడం సాధ్యం కాదని ప్రశాంత్ కిషోర్, ఉద్దవ్ థాక్రే, స్టాలిన్ వంటివారు పదేపదే సిఎం కేసీఆర్‌కు చెపుతున్న సంగతి తెలిసిందే. కనుక భవిష్యత్‌లో జాతీయస్థాయి రాజకీయాలలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేసే సూచనలు కనిపిస్తున్నందున తెలంగాణలో కూడా రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే రాహుల్ గాంధీ ఈ స్పష్టత ఇచ్చిన్నట్లు భావించవచ్చు. రాష్ట్ర స్థాయిలో పోరాడుకొంటూ జాతీయస్థాయిలో రెండు పార్టీలు కలిసి పనిచేయడం కూడా సాధ్యం కాదు కనుక బిఆర్ఎస్‌కు కాంగ్రెస్ తలుపులు మూసుకుపోయినట్లే భావించవచ్చు. కనుక సిఎం కేసీఆర్ ముందు నుంచి చెపుతున్నట్లుగా జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్, బిజెపిలకు సమాన దూరం పాటించవలసి ఉంటుంది.