ఢిల్లీ పీఠం కదిలిపోయే అస్త్రం నా దగ్గరుంది: కేసీఆర్‌

October 31, 2022


img

మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సిఎం కేసీఆర్‌ ఆదివారం బంగారిగడ్డలో బహిరంగసభ నిర్వహించిన సంగతి తెలిసిందే. టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడిన తర్వాత జరిగిన ఈ తొలి సభలో ఆయన మరిన్ని ప్రకంపనలు సృష్టించే విషయం ఏదో బయటపెట్టబోతున్నారంటూ మీడియా ఒకటే ఊదరగొట్టేసింది. కానీ సిఎం కేసీఆర్‌ మాత్రం చాలా ఆచితూచి మాట్లాడారు. 

తెలంగాణ కోసం నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు బిజెపి ఇస్తున్న వందల కోట్లు తృణప్రాయంగా వదిలేసుకొన్న నిజమైన హీరోలంటూ కేసీఆర్‌ ఆ నలుగురిని ప్రజలకు పరిచయం చేశారు. నరేంద్రమోడీకి ప్రధాని పదవి దక్కినా ఇంకా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ఎందుకు కుట్రలు చేస్తున్నారో తనకు అర్దం కాలేదన్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ఢిల్లీ నుంచి వచ్చినవారు ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారని అన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది కనుక ఇంతకుమించి మాట్లాడలేనని కేసీఆర్‌ చెప్పారు. 

దేశాన్ని అన్ని విదాల భ్రష్టు పట్టిస్తున్న బిజెపిని, మోడీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాల్సిన సమయం వచ్చిందని, ఆ ప్రయత్నంలోనే తాను బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నానని చెప్పారు. ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌కు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించడం ద్వారా బిఆర్ఎస్‌కు పునాదిరాయి వేసే గొప్ప అవకాశం మునుగోడు ప్రజలకే దక్కిందని అన్నారు. తన వద్ద మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే బ్రహ్మాస్త్రం మరొకటి సిద్దంగా ఉందన్నారు. 

రాష్ట్ర బిజెపి నేతలు తడిబట్ట, పొడిబట్ట అంటూ యాదాద్రిలో ప్రమాణాలు చేయాలని సవాళ్ళు చేస్తుంటే వాటిని తాను పట్టించుకోవాలా?అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఉపఎన్నికలొచ్చిన్నప్పుడు మాయమాటలు మాట్లాడేవారు, డ్యాన్సులు, నాటకాలు ఆడేవారూ చాలా మంది వస్తారని, వారి డ్రామాలకు పడిపోకుండా మునుగోడు ఓటర్లు మనకి ఎవరు మంచి చేస్తారు? ఎవరితో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది? అని అందరూ చర్చించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అయోమయంతో ఓట్లు వేయకుండా బాగా ఆలోచించి మరీ వేయాలని కోరారు. ఉపఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్క టిఆర్ఎస్‌ అభ్యర్ధి తప్ప మిగిలినవారెవరూ కనబడరని అటువంటి వారిని ఎన్నుకొని ప్రయోజనం ఉండదని గ్రహించాలన్నారు. 

మునుగోడు అభివృద్ధికి తాను హామీ ఇస్తున్నానని, రోడ్లు, వందపడకల హాస్పిటల్‌ వంటివన్నీ చాలా చిన్న విషయాలని తక్షణమే పనులు మొదలవుతాయని అన్నారు. కేసీఆర్‌ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం, బిజెపిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడినప్పటికీ ఆయన కొత్తగా ఏమీ చెప్పనేలేదు. గత సభలలో ఏం చెప్పారో మళ్ళీ అదే చెప్పారనుకోవచ్చు. ఢిల్లీ వెళ్ళి ప్రెస్‌మీట్‌ పెట్టి మోడీ ప్రభుత్వాన్ని గడగడలాడించేస్తారని మీడియాకు లీకులు ఇచ్చిన కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్ళలేదు కనీసం నిన్నటి సభలో ఆ స్థాయిలో మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.


Related Post