మునుగోడులో కాంగ్రెస్‌ మునిగిపోతుంటే రాహుల్ స్టెప్పులు... అదుర్స్!

October 29, 2022


img

మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందే సర్టిఫికేట్ ఇచ్చేసి ఆస్ట్రేలియాకి విమానం ఎక్కేశారు. ఆయన పోతేపాయె... అని స్రవంతక్క రేవంత్‌ రెడ్డిని ముందుంచుకొని ఎన్నికల ప్రచారం చేసుకొంటుంటే, రాహుల్ గాంధీ వచ్చి ఆయనను కూడా తీసుకుపోయారు. 

రాహుల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేస్తుంటే ‘మునుగోడు ఉపఎన్నికలలో బిజీగా ఉన్నాను... నాకు తీరికలేదని’ కలవకపోతే రేవంత్‌ కుర్చీకే ప్రమాదం. కనుక రేవంత్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌ జెండా పట్టుకొని రాహుల్ గాంధీ వెనుక బుద్దిగా నడవకతప్పడం లేదు. 

రాహుల్ గాంధీతో పాదయాత్ర కోసం కాకపోయినా ఆయనతో సెల్ఫీల కోసమో లేదా రాజకీయాలు మాట్లాడుకోవచ్చనో రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలందరూ జోళ్ళేసుకొని భారత్‌ జోడో అంటూ బయలుదేరిపోతున్నారు. దాంతో మునుగోడువైపు తొంగిచూసే కాంగ్రెస్‌ నాయకుడే లేకుండా పోయాడు. 

ఇప్పటికే ఒంటరి పోరాటం చేస్తున్న స్రవంతక్క రాహుల్ పాదయాత్రతో మరీ ఒంటరి అయిపోయారు. ఇక చేసేదేమీలేక కొద్దిపాటి అనుచరులను వెంటేసుకొని మునుగోడులో ఇంటింటికీ వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకొంటూ తనకే ఓట్లేసి గెలిపించాలని సాటి మహిళలను వేడుకొంటున్నారు. 


ఓ పక్క మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోతుంటే, తెలంగాణలో(మూడో రోజు) పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ మాత్రం హుషారుగా స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో కొమ్ముకోయలతో కలిసి రాహుల్ గాంధీ హుషారుగా స్టెప్పులేశారు. సాధారణ సమయాలలో ఎవరూ ఆయనను తప్పు పట్టలేరు కానీ ఓ పక్క మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఓటమి అంచున నిలబడి ఒంటరిపోరాటం చేస్తుంటే పార్టీని, దేశాన్ని నడిపించాలనుకొన్న రాహుల్ గాంధీ ఆమెకు అండగా నిలబడి గెలిపించుకొనే ప్రయత్నం చేయకుండా, ఆమెకు తోడుగా ఉన్నవారిని కూడా తన వెంట తీసుకుపోతుండటం బాధ్యతారాహిత్యమే. కోమటిరెడ్డి సోదరులిద్దరూ ఆమె ఓటమికి తద్వారా పార్టీ ఓటమికి ఎంత బాధ్యులో రాహుల్ గాంధీ కూడా అంతే బాధ్యుడే కదా?


Related Post