ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతోనే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలు షురూ

October 28, 2022


img



నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టిఆర్ఎస్‌ నేతలు రెచ్చిపోతారనుకొంటే సిఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు అందరూ నిశబ్ధంగా ఉండిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వ్యవహారం గురించి మునుగోడు ఉపఎన్నికలలో జోరుగా ప్రచారం చేసుకొని లబ్ది పొందే అవకాశం ఉన్నప్పటికీ, సిఎం కేసీఆర్‌ దీనిని జాతీయస్థాయిలో హైలైట్ చేయాలని నిర్ణయించడంతో టిఆర్ఎస్‌ నేతలు మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ వ్యవహారానికి సంబందించిన పోలీస్ నివేదికలు, నిందితుల వీడియో, ఆడియో సంభాషణలు, ఈలోగా బిజెపి నేతలు మాట్లాడుతున్న మాటలు, వాటిలో లొసుగులు అన్నీ సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత తనతో కలిసివచ్చే ప్రతిపక్ష నేతలతో కలిసి ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి జాతీయ మీడియాకు వివరించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు టిఆర్ఎస్‌ నేతలు చెపుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం గురించి బిజెపియేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రాంతీయపార్టీల నేతలు సిఎం కేసీఆర్‌కు ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతున్నట్లు సమాచారం. కనుక  ఈ వ్యవహారంతో కేసీఆర్‌ బిజెపిని, కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయస్థాయిలో ఎండగట్టేందుకు సిద్దం అవుతున్నారని టిఆర్ఎస్‌ నేతలు చెపుతున్నారు. 

అయితే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తదితర బిజెపి నేతలు సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ మౌనానికి మరో రకంగా అర్దం చెపుతున్నారు. ఈ డ్రామాను రచించి, దర్శకత్వం వహించి ఆడించింది కేసీఆరే కనుక బిజెపిని ఇరికించబోయి తానే ఇరుక్కొన్నట్లు గ్రహించారని, టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో మంతనాలు సాగించిన ఆ ముగ్గురు వ్యక్తులు చెప్పిన మాటలు తప్ప ఈ వ్యవహారంలో బిజెపికి ప్రమేయం ఉందనే సాక్ష్యాధారాలు లేకపోవడం వలననే కేసీఆర్‌ సైలెంట్ అయిపోయారని బండి సంజయ్‌ వాదిస్తున్నారు. 

మొన్న రాత్రి ఆ ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి రూ.15 కోట్లు నగదు పట్టుకొన్నామని చెప్పిన సైబరాబాద్ సిపి స్టీఫన్ రవీంద్ర, ఆ సొమ్మును చూపనేలేదని, ఎందుకంటే అది కేసీఆర్‌ ఫామ్‌హౌసు నుంచే వచ్చి ఉండవచ్చని బండి సంజయ్‌ ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తుంటే కేసీఆర్‌ స్పందించకపోవడం గమనిస్తే తన డ్రామా బెడిసికొట్టిందని కేసీఆర్‌ గ్రహించినట్లే ఉన్నారని బండి సంజయ్‌ అన్నారు. ఒకవేళ కేసీఆర్‌ ఈ డ్రామా ఆడించి ఉండకపోతే యాదాద్రి ఆలయంలో  తన భార్యాబిడ్డలపై ప్రమాణం చేసేందుకు రావాలని సవాలు విసిరినా స్పందించకపోవడంతో ఇది కేసీఆర్‌ కుట్రే అని రుజువవుతోందని బండి సంజయ్‌ వాదిస్తున్నారు. 

ఈ దెబ్బతో టిఆర్ఎస్‌, బిజెపిలలో ఏదో ఓ పార్టీ పనైపోతుందని చాలా మంది భావిస్తున్నప్పటికీ అలా జరిగే అవకాశం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే, ఆ రెండూ పార్టీలు అధికారంలో ఉన్న చాలా శక్తివంతమైన రాజకీయపార్టీలే కనుక ఓటుకు నోటు కేసులాగే ఈ వ్యవహారాన్ని కూడా మెల్లగా అటకెక్కించేసినా ఆశ్చర్యం లేదు.


Related Post