ప్రముఖ తెలుగు సినీ నటుడు అలీకి ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని కట్టబెట్టింది. ఈ పదవిలో ఆయన రెండేళ్ళపాటు కొనసాగుతారని జీవోలో పేర్కొంది. ఆయన జీతభత్యాలకు సంబందించి మరో జీవో జారీ చేస్తామని దానిలో పేర్కొంది. అలీ చాలా కాలంగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనసభ, మండలిలో ప్రవేశించాలని ఆశపడుతున్నారు. గతంలో టిడిపిలో, ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడూ ఆయన కల నెరవేరలేదు. ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయనను రాజ్యసభకు పంపించాలనుకొంటున్నారని ఊహాగానాలు వినిపించినా ఆ పదవులు వేరేవారికి కట్టబెట్టడంతో అవి నిజం కావని తేలిపోయింది.
దీంతో తీవ్ర నిరాశ చెందిన అలీ తన ఆప్త మిత్రుడు పవన్ కళ్యాణ్‌తో మంతనాలు చేసి జనసేనలో చేరేందుకు సిద్దం అవుతున్నట్లు వార్తలు రావడంతో జగన్ ప్రభుత్వం అప్రమత్తమై అలీకి ఈ పదవి కట్టబెట్టి ఉండవచ్చు. అయితే ఏపీ ప్రభుత్వంలో ఇప్పటికే అనేకమంది సలహాదారులు ఏ పనీ, గుర్తింపు లేకుండా ఉన్నారు. పేరుకి వారందరూ ప్రభుత్వ సలహాదార్లే గానీ వారి సలహాలను ప్రభుత్వం పట్టించుకోదు. అంటే ఇవి రాజకీయ నిరుద్యోగుల కోసమే సృష్టించిన పదవులన్న మాట. చేతికి ఆరో వేలు ఉన్నప్పటికీ అది ఎందుకు పనికిరానట్లే ఇదీను. ఒకవేళ అలీ ఈ పదవి స్వీకరించడానికి అంగీకరిస్తే ఆయన కూడా వారిలో ఒకరిగా మిగిలిపోతారు.
ఈవిషయం జగన్ ప్రభుత్వం కూడా గుర్తించినట్లే కనబడుతోంది. అందుకే అలీకి సలహాదారు పదవిలో నియమిస్తున్న జీవోలో ఆయన జీతభత్యాల గురించి పేర్కొనలేదు. దాని కోసం తర్వాత మరో జీవో జారీ చేస్తామని పేర్కొంది. అంటే అలీ ఈ పదవి చేపడతారనే నమ్మకం జగన్ ప్రభుత్వానికి కూడా లేదనమాట! మరి అలీ ఏమి నిర్ణయం తీసుకొంటారో చూడాలి.