టిఆర్ఎస్‌ పైచేయి సాధించింది.. కానీ బిజెపి ఊరుకొంటుందా?

October 27, 2022


img

మరో వారం రోజులలో మునుగోడు ఉపఎన్నికలు జరుగబోతుండగా నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో టిఆర్ఎస్‌ రాజకీయంగా పైచేయి సాధించినట్లయింది. నేటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేవరకు, ఇంకా చెప్పాలంటే ఎప్పటికీ ఇదే అంశం ప్రస్తావిస్తూ బిజెపిని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుందని వేరే చెప్పక్కరలేదు. 

ఇక సిఎం కేసీఆర్‌ బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తున్నందున ఇదే అంశాన్ని జాతీయస్థాయిలో మరింత హైలైట్ చేయకుండా విడిచిపెట్టరు. కనుక ఇది కేవలం మునుగోడు ఉపఎన్నికలకు లేదా రాష్ట్ర బిజెపికి మాత్రమే పరిమితమయ్యే విషయం ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు. 

కనుక బిజెపి, కేంద్ర ప్రభుత్వం కూడా సిఎం కేసీఆర్‌ను అదే స్థాయిలో ధీటుగా ఎదుర్కోవడం ఖాయమే. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితకు నోటీస్ పంపిస్తుందా లేక మరో అవినీతికేసును తవ్వి తీసి కేసీఆర్‌ని కట్టడి చేస్తుందా? అనేది త్వరలోనే తెలుస్తుంది. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వం, బిజెపి అధిష్టానం రెండూ కూడా కేసీఆర్‌ను కట్టడి చేయడానికి గట్టిగా ప్రయత్నించడం ఖాయం. 

ఇక మునుగోడు ఉపఎన్నికల విషయానికి వస్తే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని తమకు అనుకూలంగా ఏవిదంగా వాడుకోవాలో టిఆర్ఎస్‌కు తెలుసు. కనుక దీంతో టిఆర్ఎస్‌ విజయావకాశాలు గణనీయంగా పెంచుకోగలరు. ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ను మరోసారి ఓడించి రాష్ట్రంలో బిజెపి సత్తా చాటుకోవాలని తహతహలాడిన రాష్ట్ర బిజెపి నేతలు, ముఖ్యంగా బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఉపఎన్నికలలో గెలిచేందుకు మరింత చెమటోడ్చక తప్పదు. అయినా వారి విజయావకాశాలు తక్కువే అని చెప్పవచ్చు. 

ఈ ఉపఎన్నికలలో బిజెపి ఓడిపోతే రాష్ట్రంలో బలపడేందుకు ఇంతకాలం పడినశ్రమ అంతా వృధా అయిపోతుంది. కధ మళ్ళీ మొదటికి రావచ్చు. ఒకవేళ అదేకనుక జరిగితే ఈసారి సిఎం కేసీఆర్‌, రాష్ట్రంలో బిజెపిని కూడా పూర్తిగా నిర్వీర్యం చేయకుండా విడిచిపెట్టరు. కనుక ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలపై వచ్చే ఎన్నికల వరకు టిఆర్ఎస్‌, బిజెపిల మద్య భీకరయుద్దాలు జరిగే అవకాశం ఉంది. ఈ యుద్ధాలు కేసీఆర్‌, మోడీ, అమిత్‌ షాల రాజకీయ అనుభవానికి, వారి శక్తిసామార్ద్యాలకు నిదర్శనంగా నిలుస్తాయి.


Related Post